Alair | తెలంగాణకు ముందు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం కరువుతో తల్లడిల్లింది. వరుస కరువులతో జనం వలసలు వెళ్లిన దుస్థితి ఉండేది. స్వరాష్ట్రం సిద్ధించాక నియోజకవర్గ రూపురేఖలు అమాంతంగా మారిపో యాయి. కాళేశ్వరం జలాలతో పలు మండలాలు సస్యశ్యామలమయ్యాయి. బీడు భూముల్లో పుష్కలంగా ధాన్యం పండుతున్నది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి కృషితో నియోజకవర్గం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలాలు యాదాద్రి భువనగిరి జిల్లాను తాకాయి. సీఎం కేసీఆర్ అపర భగీరథుడై ఎక్కడో పారుతున్న గోదారమ్మను జిల్లా అంతటా ప్రవహింపజేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి కృషితో 2020లో బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో గోదావరి జలాలు పారించి రైతులకు కొత్త బతుకునిచ్చారు. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా యాదగిరిగుట్ట నర్సన్న పాదాలను కాళేశ్వరం జలాలు ముద్దాడాయి. దేవాదుల ఎత్తిపోతలో భాగంగా నిర్మించిన నవాబ్‌పేట రిజర్వాయర్ నుంచి గుండాల మండలానికి గోదావరి జలాలను పారించారు.
గతంలో బుక్లేరు, చొల్లేరు, బిక్కేరు వాగులతో పాటు ఆలేరు పెద్ద వాగు, పెద్ద కందుకూరు వాగులో నీళ్లు వృథాగా పోయేవి. బోర్లు ఎండిపోయేవి. కేసీఆర్ పాలనలో ఆయా వాగులపై 23 చెక్‌డ్యాంలు నిర్మించారు. ఇటీవల మరో 11 చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మిషన్ కాకతీయ కింద 579 చెరువులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. చెరువులు, కుంటల ఆధునీకరణకు రూ.112 కోట్లు ఖర్చు చేశారు. మిషన్ భగీరథ ద్వారా 324 ఆవాస గ్రామాలకు..74,306 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 277 ట్యాంకులకు అదనంగా మరో 216 నిర్మించారు. 1,022 కిలోమీటర్ల మేర గ్రిడ్, పైప్‌లైన్ వేసి ప్రతి గ్రామంలో ట్యాంక్‌లు శుద్ధి చేసి గోదావరి, కృష్ణా జలాలను సరఫరా చేస్తున్నారు.
త్వరలో యాదగిరిగుట్టలో 20 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం కానున్నది. సెప్టెంబర్ 16న కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.183 కోట్లు కేటాయిస్తూ పాలనా అనుమతులను మంజూరు చేసింది. త్వరలోనే టెండర్ పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆలేరులో డయాలసిస్ సెంటర్ రోగుల పాలిట వరంగా మారింది.
నియోజకవర్గంలో 3 గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. 98,519 మంది రైతులకు రైతుబంధు, 1,020 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా అందింది. రూ.300 కోట్లతో కొత్త రోడ్లు నిర్మించారు. 15వేల మంది ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి సాయం అందింది. తుర్కపల్లిలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు కోసం 93.21 ఎకరాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యింది.
తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. గ్రామంలోనే దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. 75 మందికి దళిత బంధు వర్తింపజేశారు. 75 మందికి ఇండ్లు కట్టించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే పలు ప్రభుత్వ భవనాలు నిర్మించగా, మిగతా పనులు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం రూ.1,280 కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించింది. 2015లో దసరా రోజున సీఎం కేసీఆర్ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా, 2022 మార్చి 28న ప్రధానాలయం పునఃప్రారంభమయ్యింది. ఆలయ నిర్మాణానికి 9.5 లక్షల ఘనపు మీటర్ల (2.5 లక్షల టన్నులు) కృష్ణశిలలను వినియోగించారు. ఆలయ గోపురాలు, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజ స్తంభం, శివాలయం, క్యూలు, వంటశాల, పుషరిణి, యాగశాలను నిర్మించారు. కొండపైన విష్ణు పుషరిణి, కొండ దిగువన లక్ష్మీ పుషరిణి, స్వామివారి తెప్పోత్సవం కోసం గండిచెరువు, కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, నిత్యాన్నదాన సత్రం, సత్యనారాయణస్వామి వ్రత మండపం, ఆర్టీసీ, దేవస్థానం బస్టాండ్లు, గుట్ట చుట్టూ రెండు ఫ్లై ఓవర్లు నిర్మించారు.
…?పున్న శ్రీకాంత్