బోనకల్లు, ఏప్రిల్ 12 : భయం మనిషిని ఎంతటి దారుణ నిర్ణయానికైనా పురికొల్పుతుందని చెప్పడానికి ఖమ్మం జిల్లాలో జరిగిన అక్షంత్ ఆత్మహత్య ఘటనే నిదర్శనం. పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ప్రాణాలు తీసుకున్న ఆ విద్యార్థి, ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణుడవ్వడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. పూర్తి వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాపల్లికి చెందిన గంగదేవుల అక్షంత్ వైరాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివాడు. పరీక్షలు రాసినప్పటి నుంచి ఫెయిల్ అవుతాననే తీవ్ర ఆందోళనలో ఉన్న అక్షంత్ ఫలితాలు రాకముందే.. ఈ నెల 9న అర్ధరాత్రి మధిర రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదివారం ఉదయం ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. తన కుమారుడు ఏ పరీక్ష గురించి భయపడి చనిపోయాడో, ఆ ఫలితాల్లో అక్షంత్ ఎంపీసీ గ్రూపులో 347 మారులు సాధించి పాసైనట్టు సమాచారం రావడంతో తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. ఆత్మహత్యకు పాల్పడేముందు కాస్త ఓపికగా ఆలోచిస్తే తమబిడ్డ కండ్లముందే ఉండేవాడుకదా అంటూ ఆ తల్లిదండ్రులు ఫలితాల కాపీని చూస్తూ రోదిస్తున్న తీరు అకడున్న వారిని కలచివేసింది. ప్రాణం కంటే పరీక్ష పెద్దది కాదని, విద్యార్థులు ధైర్యంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తున్నది.