Nagarjuna | నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సినీనటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య, కోడలు యార్లగడ్డ సుప్రియ మంగళవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. అనంతరం నాగార్జున, సుప్రియ వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది.
రెండో సాక్షిగా ఉన్న వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని ఈ నెల 10న నమోదు చేయనున్నట్టు కోర్టు ప్రకటించింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో పేరు ప్రతిష్ఠలున్న వ్యక్తిగా భారతీయ సినిమా రంగంలో తనకు సమున్నత స్థానం ఉన్నదని నాగార్జున కోర్టుకు తెలిపారు. దాదాపు 4 దశాబ్దాల నుంచి సినీ రంగంలో నటుడిగా, నిర్మాతగా, బిగ్‌బాస్ హోస్ట్‌గా, అన్నపూర్ణ స్టూడియో అధినేతగా కొనసాగుతున్న తనకు అభిమానుల నుంచి గుర్తుంపు లభించిందని, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో 90కిపైగా చిత్రాల్లో నటించానని వివరించారు.
తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తెలుగు సినీ పరిశ్రమలో అభిమానుల ఆదరణ పొందానని, సినీ రంగంలో తన విశేష కృషికి గుర్తింపుగా 9 నంది అవార్డులు, 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయని చెప్పారు. 2017లో పెద్దల అంగీకారంతో నాగచైతన్య-సమంత వివాహం జరిగిందని, తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లో కథానాయికగా నటించి సమంత మంచి గుర్తింపు తెచ్చుకున్నదని తెలిపారు. నాగచైతన్య-సమంతల మధ్య తలెత్తిన వివాదాల వల్ల వారిద్దరూ సొంత నిర్ణయం మేరకు 2021లో ఇష్టపూర్వకంగానే విడాకులు పొందారని, అనంతరం వారిద్దరు వేర్వేరుగా గౌరవప్రదంగా జీవిస్తున్నారని కోర్టుకు వివరించారు.
నిరాధార ఆరోపణల వల్ల వారి వ్యక్తిగత జీవితాలపై దుష్ప్రభావం పడే అవకాశమున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబం పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు పలు టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం కావడంతోపాటు పత్రికల్లోనూ వార్తలు వచ్చాయని వివరించారు. అనంతరం ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తల క్లిప్పింగులు, పెన్‌డ్రైవ్‌లను మేజిస్ట్రేట్‌కు చూపించారు. ఎన్-కన్వెన్షన్ హాల్‌కు, నాగచైతన్య-సమంత విడాకులకు ఎలాంటి సంబంధం లేదని నాగార్జున స్పష్టం చేశారు.
నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం కావడంతో అభిమానులు, స్నేహితులు, కుటుంబసభ్యులు తనకు ఫోన్లు చేశారని నాగార్జున కోడలు యార్లగడ్డ సుప్రియ కోర్టుకు వివరించారు. తన మామపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని, ఆ వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం మంత్రి సురేఖ మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలను చదివి కోర్టుకు వినిపించారు.
నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని, వారిద్దరు పరస్పర అంగీకారంతో ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్నారని వివరించారు. సమంత కూడా పేరున్న నటిగా సమాజంలో చలామణి అవుతున్నారని, రాజకీయ లబ్ధి కోసమే అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ నిందారోపణలు చేశారని కోర్టుకు స్పష్టం చేశారు.