హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మైనార్టీలకు దోస్తు అని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. మైనార్టీల వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలను అర్థం చేసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్నింటా ముందున్నదని, ఆ తరువాతనే ఇతర రాష్ట్రాలున్నాయని మంగళవారం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. నీటి పారుదల ప్రాజెక్టులలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రగతికి అడ్డుపడేలా నిర్ణయాలు తీసుకుందని అక్బరుద్దీన్ మండిపడ్డారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై కేంద్రం జారీచేసిన గెజిట్‌కు వ్యతిరేకంగా వీధి పోరాటాలు చేయడానికి సిద్ధం కావాలన్నారు. సింగరేణిలోని 49 శాతం కేంద్రవాటాను ఉన్న తెలంగాణ తీసేసుకోవాలని చెప్పారు. జీహెచ్ఎంసీకి పదివేల కోట్లు ఇవ్వాలని కోరారు. పాతనగరంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వక్ఫ్ భూములు కాపాడాలని కోరారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా మంచివాళ్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే మైనార్టీ కమిషన్, హజ్ కమిటీ, ఉర్దూ అకాడమీ, మైనార్టీ కమిషన్‌కు పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని కోరారు. మైనార్టీ స్టడీ సర్కిల్‌కు పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించాలని సూచించారు. నియోజకవర్గాల అభివృద్ధికి ఇచ్చిన రూ.2 కోట్లు సరిపోవడం లేదని, దీనికి రూ.5 కోట్లకు పెంచాలని కోరారు.