Akbaruddin Owaisi | హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాం తిభద్రతలు (లా అండ్ ఆర్డర్)పూర్తిగా గాడి తప్పాయని ఎంఐ ఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరంలో కత్తులు దూసుకుంటూ హత్యలు జరుగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాత్రి 11గంటల తర్వాత ఇంటి బయట నిల్చొన్న వారినీ పోలీసులు కొడుతున్నారని, ఇదేం జులుం అని ప్రశ్నించారు. ఇందుకేనా కాంగ్రెస్‌ను తెచ్చుకున్నదని మండిపడ్డారు.
గతంలో తనపై పెట్టిన కేసును మళ్లీ తిరగదోడారని, సీఎం రేవంత్‌రెడ్డి బడేభాయ్కా భాయ్ అమిత్‌షాపై కేసును మాత్రం ఉపసంహరించుకున్నారని విమర్శించారు. శనివారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే అంటుండడంపై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో మీకు తెలియదా అని నిలదీశారు.
‘గత పదేళ్లు డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్‌బాబు సహా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సభలోనే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో అన్ని లెక్కల్ని సభ ముందు పెట్టింది. దానికి మీరంతా సాక్షులు. అవేవి తెలియనట్టుగా రాష్ట్రం అప్పులపాలైందని ఎలా అంటారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసుకదా. ఇప్పుడు ఈ విమర్శలెందుకు ?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర జీఎస్డీపీ 2014లో 4.51 లక్షల కోట్లు ఉండగా, ప్రస్తుతం 14.63 కోట్లకు పెరిగిందని.. తలసరి ఆదాయం 1.12 లక్షల నుంచి రూ. 3.47 లక్షలకు పెరిగిందని చెప్పారు.
కాంగ్రెస్ మంత్రులు చెబుతున్నట్టుగా రాష్ట్ర ఆర్థిక నిర్వహణ బాగాలేకపోతే జీఎస్డీపీ, తలసరి ఆదాయం అభివృద్ధి ఏ విధంగా సాధ్యమైందో చెప్పాలన్నారు. కేంద్రం నుంచి బకాయిలు రావడం లేదంటూనే బడ్జెట్లో కేంద్రం నుంచి భారీ నిధులు వస్తాయని చూపడం ఏమిటని ప్రశ్నించారు. బహుశా ఓల్డ్‌సిటీని అదానీకి ఇస్తే.. ఆయన వల్ల ఏమైనా కేంద్రం నుంచి నిధులు వస్తాయేమోనని విమర్శించారు. అన్ని పథకాలకు రేషన్‌కార్డు తప్పనిసరి చేసిన ప్రభుత్వం కొత్త కార్డులు మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు.
బడ్జెట్ లెక్కలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన స్పీచ్‌లో ఒక లెక్క చెబితే.. బడ్జెట్ కాపీలో మరో లెక్క, సీఐజీ కాపీలో మరో లెక్క.. ఇలా ఒక్కోచోట ఒక్కో రకంగా ఉన్నాయని విమర్శించారు. ఈ తప్పుడు లెక్కలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. దీనిపై కఠిన చర్య లు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. బడ్జెట్లో తప్పుడు లెక్కలు సభ పరువుకు సంబంధించిన అంశమని ఘా టుగా వ్యాఖ్యానించారు.