హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): చట్ట సభల సంప్రదాయాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యబద్ధంగా సమావేశాలను నిర్వహించాలని శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. చట్ట సభల సంప్రదాయాన్ని, హుందాతనాన్ని పోగొట్టవద్దని అధికార పక్షానికి హితవు పలికారు. ప్రభుత్వానికి వినే ఓపిక ఉండాలని, విమర్శలను కూడా స్వీరించాలని, అదే ప్రజాస్వామ్యమని చురకలంటించారు. మంగళవారం అసెంబ్లీలో టూరిజం, అటవి, విద్య, రోడ్లు, భవనాలు, కమర్షియల్ ట్యాక్స్‌తోపాటు పలు శాఖలకు సంబంధించిన బడ్జెట్ పద్దులపై కొనసాగిన చర్చలో ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అసెంబ్లీని నిర్వహిస్తున్న తీరును తూర్పారబట్టారు. గతంలో రోజుకు మూడు లేదా నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన డిమాండ్స్, గ్రాంట్స్ మీద మాత్రమే చర్చ పెట్టేవారని, కానీ, ఇప్పుడు ఒక్కరోజే 11 డిమాండ్లను ప్రభుత్వం చర్చకు పెట్టిందని, ఇదెక్కడి పద్ధతి? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 26 ఏండ్లుగా శాసనసభ సమావేశాల్లో పాల్గొంటున్నానని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని చెప్పారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ సమావేశాలను కొనసాగిస్తున్నారని, చివరకు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను కూడా ఎత్తేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. చర్చకు పెట్టిన సబ్జెక్టుల డిమాండ్ల కాపీలను కూడా ఒకేసారి ఇవ్వడం లేదని, డిమాండ్ కాపీలను ఇవ్వకుంటే సభ్యులు ఎలా మాట్లాడుతారని నిలదీశారు. కమర్షియల్ ట్యాక్స్ అత్యంత ముఖ్యమైన సబ్జెక్టనీ, కేవలం 10 పేజీలతో జీఎస్టీ, సీఎస్టీ, వ్యాట్ వివరాలు లేకుండా కాపీలు ఇచ్చారని, గణాంకాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని నిలదీశారు.
గ్రామాల్లో బెల్ట్‌షాపుల విస్తరణ
కాంగ్రెస్ సర్కార్ మద్యపానాన్ని పెంచి పోషిస్తున్నదని, ప్రతి గ్రామంలో బెల్టుషాపులు విస్తరించాయని అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ప్రభుత్వం ఒకవైపు తాగిస్తూ, తాగుడును ప్రోత్సహిస్తూ, మరోవైపు ప్రొహిబిషన్ అనడం ఏమిటని చురకలేశారు. మద్యపానం ఫలితంగా ప్రతి మహిళ, తల్లి, అక్క, కూతురు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా మద్యపానాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు.
ఓల్డ్‌సిటీపై ఎందుకీ ద్వేషం?
విస్తరణ పేరిట పాతనగరం నుంచి అన్నింటినీ తరలిస్తున్నారని, ఓల్డ్‌సిటీపై ఎందుకింత ద్వేషమని అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇప్పటికే కమిషనరేట్‌ను తరలించారని, నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను కూడా తరలించేందుకు సిద్ధమయ్యారని, ఇక సాలార్జంగ్ మ్యూజియాన్ని కూడా హైటెక్ సిటీకి తరలిస్తామంటారని దుయ్యబట్టారు. ‘పాత నగరంలో మనుషులను బతకనిస్తలేరు, కనీసం జంతువులైనా ఉంచండి’ అంటే జూ తరలింపుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. జూను అక్కడే కొనసాగించాలని, అవసరమైతే మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా దవాఖాన భవనాన్ని కూల్చవద్దని కోరారు.
నామ్ దేనా ఆసాన్
కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీలకు పేర్లు పెడుతూ ప్రచారం చేసుకుంటున్నదని అక్బరుద్దీన్ చురకలంటించారు. నామ్ దేనా ఆసాన్.. కామ్ కర్నేకా పాలిటిక్స్ (పేర్లు పెట్టడం సులభం.. కానీ పనిచేసి రాజకీయాలు చేయండి) అని వ్యాఖ్యానించారు. మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం విద్య కోసం బడ్జెట్లో 15% నిధులు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. సొంత స్థలాలు ఉన్నచోట భవనాలను నిర్మించకుండా, గురుకులాలను అభివృద్ధి చేయకుండా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ విపరీతంగా పెరుగుతున్నాయని, దీనిపై అధ్యయనం చేయించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రంజాన్ సందర్భంగా చిన్నారులను పనులకు కుదుర్చుకునే వ్యాపారులపై కేసులు పెట్టాలని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించి సన్మానించాలని, ఇంజినీరింగ్ కోర్సుల్లో అన్ని యూనివర్సిటీలకు ఒకే రూల్స్ పాటించాలని సూచించారు.