హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ (ఏకే సింగ్) ఈ నెల 19న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్టు హైకోర్టు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌లుగా ఇప్పటి వరకు ఆరుగురు పనిచేశారు.
ప్రస్తుతం త్రిపుర హైకోర్టు నుంచి బదిలీపై రానున్న జస్టిస్ ఏకే సింగ్ ఏడో చీఫ్ జస్టిస్. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, సీఎం, పలువురు మంత్రు లు హాజరుకానున్నారు.
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ సుజోయ్‌పాల్ కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం మధ్యాహ్నం ఆయనకు హైకోర్టు న్యాయమూర్తులు వీడోలు పలకనున్నారు. మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ తడకమళ్ల వినోద్ కుమార్‌కు కూడా హైకోర్టు వీడోలు చెప్పనున్నది.
గతంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన జస్టిస్ అలోక్ అరాధే ఈ ఏడాది జనవరిలో బదిలీపై బాంబే హైకోర్టుకు వెళ్లడంతో అదే నెల 11 నుంచి జస్టిస్ సుజోయ్‌పాల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా సేవలందిస్తున్నారు. ఆయన బదిలీ అనంతరం నూతన చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణస్వీకారం చేసే వరకు (రెండు రోజులు) తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పీ శ్యాం కోషి వ్యవహరించే అవకాశం ఉన్నది.