హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఈ ఏడాది ఏడు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంజినీరింగ్లో మాత్రమే లభ్యమయ్యే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ కోర్సులను కేజీబీవీల్లోనూ ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 495 కేజీబీవీలున్నాయి. వీటిల్లో ఇంటర్ విద్య కూడా అందిస్తున్నారు. ఒక్కో కోర్సులో 40 సీట్లున్నాయి. ప్రస్తుతం 29,203 మంది బాలికలు అడ్మిషన్లు పొందారు. ఈ కాలేజీల్లో జనరల్ కోర్సులు అయిన ఎంపీసీ, బైపీసీ, సీఈసీతోపాటు ఎంపీహెచ్డబ్ల్యూ వొకేషనల్ కోర్సును మాత్రమే నిర్వహిస్తున్నారు. వొకేషనల్ కోర్సుల్లో భాగంగా ఈ ఏడాది కంప్యూటర్సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మా టెక్నాలజీ, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ వంటి ఏడు కోర్సులు ప్రవేశపెట్టారు.
ఈ ఏడాది 120 కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశారు. మొత్తం 495 కేజీబీవీలుండగా, 2018 ముందు వరకు వీటిని కేవలం పదో తరగతి వరకే నిర్వహించేవారు. అమ్మాయిలకు ఉన్నత విద్య అందించేందుకు గత కేసీఆర్ సర్కారు కేజీబీవీలను క్రమక్రమంగా ఇంటర్ వరకు అప్గ్రేడ్చేసింది. దశలవారీగా 283 కేజీబీవీల స్థాయిని పెంచి, బాలికలకు నాణ్యమైన విద్య అందించింది. వీటిల్లో రెగ్యులర్ కోర్సులతోపాటు వొకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టింది. కేసీఆర్ సర్కారు వేసిన బాటలోనే రాష్ట్రప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం 120 కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్చేసింది. దీంతో 495 కేజీబీవీలుంటే 403 కేజీబీవీల్లో ఇంటర్ విద్య అందుబాటులోకి వచ్చినైట్టెంది.