హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయితే సంతోషిస్తానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడి యా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు తిరగడానికి ఢిల్లీ కంటే హైదరాబాద్ దగ్గరవుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయాలని అంబేద్కర్ ప్రతిపాదించారని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన మల్లికార్జున్ ఖర్గే హోటల్ తాజ్‌కృష్ణాలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఐదేండ్లు పూర్తికాలం ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత మిగతా హామీలను అమలు చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏమి ఇచ్చిందో చెప్పడానికి అనేకం ఉన్నాయని, మరి కేంద్రంలో పదేండ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ ఏమిచ్చిందో ప్రధాని మోదీ చెప్పగలరా? అని ఖర్గే ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులు తప్ప ఒక్కటైనా బీజేపీ ఇచ్చిందా? కనీసం జాతీయహోదా అయినా ప్రకటించిందా? అని నిలదీశారు.
అదానీ, అంబానీల డబ్బు వ్యాన్లలో తరలిస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు పట్టుకోవడం లేదని ఖర్గే మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీల డబ్బులు తరలించడవల్లనే రాహుల్‌గాంధీ వారి గురించి మాట్లాడటం లేదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో మోదీకి మించిన వారు లేరని మండిపడ్డారు. ఖర్గే అల్లుడు రూ.400 కోట్ల కుంభకోణం ఆరోపణలపై స్పందిస్తూ, అందులో నిజముంటే జైల్లో వేయండని సూచించారు.