హైదరాబాద్, అక్టోబర్11(నమస్తే తెలంగాణ): తెలంగాణలోని డీసీసీ అధ్యక్ష పదవుల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు శనివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించారు. దాదాపు రెండేండ్లుగా టీపీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామక ప్రక్రియ చేయలేకపోవడంతో ఆ బాధ్యతలను ఏఐసీసీ తన చేతుల్లోకి తీసుకున్నది. ఈ మేరకు రాష్ర్టానికి 22 మంది పరిశీలకులను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు. వారంతా శుక్రవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లారు. దాదాపు వారంపాటు జిల్లాల్లో పర్యటిస్తారని, కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నాయకత్వాన్ని వారు కలుస్తారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. తొలిరోజు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుదారుల్లో ఒకరిని డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఏ ప్రామాణికత ఆధారంగా డీసీసీలను ఎంపిక చేస్తారో మాత్రం చెప్పలేదు.