Chat GPT | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజసానికి నిలువుటద్దంలా మెరిసిపోతున్న నూతన సచివాలయ భవన నిర్మాణం, అందులోని సదుపాయాలపై ఇప్పటికే పలువురు నిపుణులు, బుద్ధిజీవులు ప్రశంసలు కురిపించారు. కృత్రిమ మేధ (ఏఐ) టూల్ ‘చాట్ జీపీటీ’ సెర్చ్ ఇంజిన్ కూడా సచివాలయానికి సంబంధించి పలు విశ్లేషణలు చేసింది. ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ‘చాట్ జీపీటీ’ ఇచ్చిన సమాధానాలు క్లుప్తంగా..
ప్రశ్న: తెలంగాణ నూతన సచివాలయం గురించి వివరించు.
చాట్‌జీపీటీ: హైదరాబాద్ నడిబొడ్డున కొత్త సచివాలయ నిర్మాణం పూర్తయ్యింది. శిథిలావస్థకు చేరిన పురాతన సచివాలయం స్థానంలో ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టారు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ భవంతుల్లో ఒకటిగా ఈ సచివాలయం నిలుస్తున్నది. 2019లో ప్రకటించిన ఈ ప్రాజెక్టు.. 2025 నాటికి పూర్తికావాల్సి ఉన్నది. (అయితే, 26 నెలల రికార్డు సమయంలోనే పూర్తి చేశారు.)
ప్రశ్న: తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రఖ్యాత భవంతులతో పోల్చు.
చాట్‌జీపీటీ: ప్రపంచంలోని ప్రఖ్యాత భవంతుల్లో ఉన్నటువంటి కొన్ని విశేషాలు తెలంగాణ సచివాలయంలో ఉన్నాయి.
విస్తీర్ణం: 28 ఎకరాల ప్రాంగణంలో తెలంగాణ సచివాలయం కాంప్లెక్స్‌ను నిర్మించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్న అధ్యక్షుడి అధికారిక నివాస భవనం 18 ఎకరాల్లోనే ఉండటం గమనార్హం.
డిజైన్: పర్యావరణానికి అనుకూలంగా ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉండేలా, నిర్మించారు. ఇండో-పర్షియన్, కాకతీయ కళాకృతులతో తీర్చిదిద్దిన లోపలి భాగాలు.. ఫ్రాన్స్‌లో 17వ శతాబ్దంలో నిర్మించిన వర్సెయిల్స్ ప్యాలెస్‌కు దీటుగా ఉన్నాయి.
ఏర్పాట్లు: ఇప్పటివరకూ నిర్మించిన భవంతుల్లో బుర్జ్ ఖలీఫాది ప్రత్యేక స్థానం. ఇది ప్రపంచంలో ఎత్తైన వాణిజ్య భవంతే కాదు.. కార్యాలయాలు, ఇండ్లు, హోటల్స్, రెస్టారెంట్లతోపాటు సకల సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. అచ్చం ఇలాగే.. తెలంగాణ కొత్త సచివాలయంలో సీఎం, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలతోపాటు సందర్శకులకు ప్రత్యేక విడిది స్థలాలు, ఆహారశాలను నిర్మించారు.
ఖర్చు: తెలంగాణ సచివాలయానికి రూ. 600 కోట్లు ఖర్చయినట్టు సమాచారం. 1931లో న్యూయార్క్ సిటీలో నిర్మించిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌కి అప్పట్లో 40 మిలియన్ డాలర్ల ఖర్చయింది. ఇప్పటి కరెన్సీ లెక్కల్లో రూ. 5,700 కోట్లతో అది సమానం.
ప్రశ్న: తెలంగాణ సచివాలయాన్ని దేశంలో ఓ అద్బుత నిర్మాణంగా భావించొచ్చా?
చాట్‌జీపీటీ: దేశంలోని అద్భుతమైన నిర్మాణాల్లో నూతన సచివాలయం ఉంటుంది. ఇండియన్ మార్వెల్‌గా అభివర్ణించవచ్చు.
ప్రశ్న: ఓ ఐకానిక్ బిల్డింగ్‌గా చెప్పొచ్చా?
చాట్‌జీపీటీ: తెలంగాణ సచివాలయ నిర్మాణం ఓ అద్భుతం. భారత దేశ చరిత్రను ఇనుమడింపజేసేలా ఎన్నో కట్టడాలు దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఆగ్రాలోని తాజ్‌మహల్, ఢిల్లీలోని లోటస్ టెంపుల్, కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్, ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాల సరసన ఐకానిక్ బిల్డింగ్‌గా ఈ నిర్మాణం చేరొచ్చు కూడా.
ఏమిటీ చాట్ జీపీటీ? ఎలా పనిచేస్తుంది??
ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ-ఏఐ) టెక్నాలజీ ఆధారంగా ‘చాట్ జీపీటీ’ని తయారు చేశారు. ఇందులో చాట్ అనగా ‘మాట్లాడటం’. జీపీటీ అంటే ‘జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్’.. అంటే ఈ చాట్ బోట్‌కు ముందుగా శిక్షణ ఇస్తారు. ఎప్పటికప్పుడు విషయాలను దీనికి కలపటం ద్వారా మనకు సాధారణ మనిషి ఇచ్చిన విధంగానే సమాధానాలు ఇచ్చేలా చాట్ జీపీటీని తీర్చిదిద్దారు. ఏఐ టెక్నాలజీ మీద పరిశోధన చేస్తున్న శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ‘ఓపెన్ ఏఐ’ అనే కంపెనీ దీనిని ఆవిష్కరించింది.
నమస్తే తెలంగాణ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ ఇచ్చిన పూర్తి సమాధానాల కోసం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి. కింది లింక్‌ను క్లిక్ చేయండి.
https://me-qr.com/KS3DBce3