సూర్యాపేట, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ) : కంచె గచ్చిబౌలి వాస్తవాలను ఏఐకు ముడిపెట్టడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. హెచ్‌సీయూలో నెమళ్ల అరుపులు, పోలీసుల లాఠీచార్జిలు, జింకల చావులు, బుల్డోజర్లు కూడా ఏఐ సృష్టేనా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన రివ్యూపై ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రేవంత్ తీరు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా ఉందని విమర్శించారు. సీఎం స్థాయిలో జరగాల్సిన రివ్యూలా లేదని పేర్కొన్నారు. సీఎం తీరును చూసి సామాన్య ప్రజలు సైతం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారులు, అనుచరులు ఇస్తున్న సలహాలపై పునరాలోచన చేసి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించడం రేవంత్ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అసలు ఏఐ కంచె గచ్చిబౌలిలో పుట్టిందా, అక్కడ ఊరకుక్కలు, జింకలను చంపింది ఏఐ సృష్టేనా అని నిలదీశారు. లేనివి సృష్టించడం, తప్పుడు ప్రచారాలు చేయడం రేవంత్‌కే అలవాటని చెప్పారు. ఈ విషయంలో కోర్టుకు పోతామంటే వాళ్లకు చీవాట్లు తప్పవని తెలిపారు. సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకున్నప్పుడే వాళ్ల ఆలోచన మార్చుకోవాల్సిందని హితవు పలికారు. యూనివర్సిటీనే మార్చుతామన్న రేవంత్ లీకులు అనాలోచితమేనని, అసలు కొత్తగా యూనివర్సిటీ అనుకుంటున్న దగ్గరే 400 ఎకరాలు కూడా ఇచ్చుకోవచ్చు కదా అని పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజలను తక్కువ అంచనా వేయడం సరికాదని, రేవంత్ ఇప్పటికైనా తెలివి తక్కువ పనులు మాని అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిందని హితవుపలికారు.