Tummala Nageswara Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రుణం చెల్లించలేదనే కారణంతో జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన రైతు ఇంటి గేటును బ్యాంకర్లు తీసుకెళ్లడం ప్రభుత్వానికి అవమానకరం అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ‘నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్’లో ఆయన మాటాడుతూ.. రుణం తీర్చలేదని రైతు ఇంటి గేటును బ్యాంకర్లు తీసుకెళ్లినట్టు పేపర్లో చూశానని చెప్పారు. బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని చెల్లించని వారిని ఏం చేస్తున్నారని ప్రజలు తమను నిలదీస్తున్నారని తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి వారి వద్ద నుంచి నగదును ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారని బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రుణాలు ఎగ్గొట్టే ఉద్దేశం ఉండదని.. తల తాకట్టు పెట్టి అయినా రుణాలు తీరుస్తారని పేర్కొన్నారు. మరోసారి రైతులతో ఇలా ప్రవర్తించొద్దని బ్యాంకర్లను హెచ్చరించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షలు ఇస్తున్నదని, అవి సరిపోవని తమకు తెలుసని చెప్పారు. ఇంకో లక్షన్నర ఇస్తే ఇల్లు కట్టుకునే వీలుంటుందన్నారు. ఆర్థికంగా ఉన్నవారికి రుణాలు ఇవ్వొద్దని మధ్య తరగతి కుటుంబాలకు ఇవ్వాలని కోరారు. రైతాంగానికి, పేదలకు ‘స్టేట్ ఫోకస్ పేపర్’ ఉపయోగపడేలా ఉండాలని అధికారులను తుమ్మల ఆదేశించారు.