హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచే పెసర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకు క్వింటాకు మద్దతు ధర రూ.8,682 చెల్లించాలని ఆదేశించారు. ప్రస్తుత సీజన్లో 64,175 ఎకరాల్లో పెసర సాగైందని, 17,841 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు.
ప్రస్తుతం పంటకోత దశకు వచ్చిన 12 ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి, కొనుగోళ్లను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మేరకు ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నారాయణపేట, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కేంద్రాల్లో రైతులకు మార్ఫెడ్ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పెసర పంట కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని హరీశ్‌రావు బుధవారమే సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. స్పందించిన మంత్రి తుమ్మల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించడం గమనార్హం.