ఖిల్లాఘణపురం, మే 8: భవిష్యత్తులో తాగు, సాగునీటికి ఢోకా లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టులు, కాల్వలు నిర్మిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి మంత్రి శంకుస్థాపనలు చేశారు. అలాగే కర్నెతండా లిఫ్ట్ పనులను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. కర్నెతండా ఎత్తిపోతల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
లిఫ్ట్ నిర్మాణ పనులను రూ.76 కోట్లతో చేపట్టినట్టు చెప్పారు. మూడు నెలల్లో కర్నెతండా ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పంపింగ్ మోటర్లు, కరెంట్ పనులు మిగిలిపోయాయని, వాటిని త్వరగా పూర్తి చేయిస్తామని చెప్పారు. ఘణపురం మండలంలో కర్నెతండా 550 అడుగుల ఎత్తులో ఉన్నదని, దొంతికుంట తండా కాలువ పనులు పూర్తయితే అప్పర్ప్లాట్లోని 500 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని భావించిన సీఎం కేసీఆర్.. పల్లెల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారని వివరించారు.