Minister Niranjan reddy | వనపర్తి, మే 17: కాంగ్రెస్ పాపం.. పాలమూరుకు శాపమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మల్లు భట్టి విక్రమార్క.. పాలమూరు జిల్లా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు.
పాలమూరు-రంగారెడ్డి పనులు జరగకుండా అడ్డుపుల్లలు వేసింది కాంగ్రెస్సేనని విరుచుకుపడ్డారు. ‘263 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం జలాశయాన్ని వదిలి 6 టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల వద్ద నుంచి నీటిని తీసుకోవాలని పట్టుబట్టింది మీ పార్టీ నేతలే కదా? వందల కేసులను ఎదుర్కొని పాలమూరు ప్రాజెక్టు పనులను తుది దశకు తీసుకొచ్చాం. ఏం జరిగిందో? ఏం జరుగుతున్నదో? తెలుసుకొని మాట్లాడాలి’ అని భట్టి విక్రమార్కకు సూచించారు.
ఉమ్మడి జిల్లాలో వలసలు, ఆకలి చావులకు కారణం కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాల పాలనలో పాలమూరును భ్రష్టుపట్టించిందని, పోతిరెడ్డిపాడుతో పాలమూరు పొట్టగొట్టిందని విమర్శించారు. జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాల్సింది కేంద్రమే అయితే.. ఇందుకోసం కాంగ్రెస్ ఎంపీలు ఒక్క రోజు కూడా పార్లమెంట్లో మోదీ సర్కార్‌ను నిలదీయలేదని విమర్శించారు. ఇలాంటి వారికి పాలమూరు జిల్లా.. ఇక్కడి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.