హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): సచివాలయం గుమ్మటాలు కూలుస్తామని బండి సంజయ్, ప్రగతిభవన్‌ను నక్సలైట్లు బాంబులతో పేల్చాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రేవంత్, సంజయ్ వ్యాఖ్యలపై ఆయా పార్టీల అధిష్ఠానాలు స్పందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..జాతీయ పార్టీలకు రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్నవారు అరాచకంగా, అనాగరికంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాళ్ల మాటలను డీజీపీ సుమోటోగా తీసుకుని కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
బండి సంజయ్‌కు అసలు గుమ్మటాలు అంటే ఏమిటో తెలుసా? అని ప్రశ్నించారు. గుమ్మటాలు అనేవి ఇంజినీరింగ్ అద్భుతాలని, గుమ్మటం అనేది ఒక ఆకృతని చెప్పారు. సుప్రీంకోర్టు, ఎర్రకోట, శాసనసభ భవనాలకు కూడా డోమ్‌లు ఉన్నాయని, వాటిని కూడా కూలుస్తారా? అని నిలదీశారు. బండి సంజయ్ వంటి వ్యక్తిని బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా నియమించారో బీజేపీ అధిష్ఠానం పునరాలోచించుకోవాలని మంత్రి ఈ సందర్భంగా హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, నన్నపనేని నరేందర్, పద్మా దేవేందర్‌రెడ్డి, జాజుల సురేందర్ పాల్గొన్నారు.