మేడ్చల్, మే 21 (నమస్తే తెలంగాణ) : ఆరోగ్య వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని, రైతులు సేంద్రియ వ్యవసాయంవైపు మళ్లాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు. ఆదివారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడ మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో ‘రైతు విజయం-ప్రకృతి రైతు బజార్ వేదిక’ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరై, మాట్లాడారు. మార్కెట్లో ఆరోగ్యకర వ్యవసాయ ఉత్పత్తులు లభించడం లేదని పేర్కొన్నారు. సేంద్రియ ఉత్పత్తులు రసాయనిక ఎరువులతో పండించిన పంటల కంటే ఎక్కువ ధర పలుకుతాయని తెలిపారు. రైతులు మార్కెట్‌పై అవగాన పెంచుకోవాలని సూచించారు.
సీఎం కేసీఆర్ కృషితోనే అన్నపూర్ణగా తెలంగాణ
సీఎం కేసీఆర్ కృషివల్లే వ్యవసాయరంగంలో తెలంగాణ అనూహ్య అభివృద్ధి సాధించిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయంలో పంజాబ్, హర్యానా రాష్ర్టాలను తోసిపుచ్చి తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా ఎదిగిందని తెలిపారు. వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా, సాగునీరు, 24 గంటల నాణ్యమైన కరెంటు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తూ.. పండించిన పంటను మద్దతు ధరకు కొంటున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ సంకల్పంతోనే తెలంగాణలో 40 వేల చెరువులు మే నెలలో మండుటెండల్లోనూ నీళ్లతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు.
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వచ్చిందని, భవిష్యత్తులో దేశంలో పార్టీ అధికారంలోకి రానున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పథకాలు దేశంలోని ప్రతి రైతుకూ అందేలా బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు సేంద్రియ ఉత్పత్తులను సరసమైన ధరలకే అందజేయాలన్న దృఢ సంకల్పంతో ‘రైతు విజయం-ప్రకృతి రైతు బజార్’ను ఏర్పాటు చేశామని నవ నిర్మాణ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు సాంబశివ తూములూరు వివరించారు. సమావేశంలో మల్లారెడ్డి ఆగ్రికల్చర్ సైన్సెస్ డీన్ రాజారెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.