High Court | హైదరాబాద్ సిటీబ్యూరో/హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంతో జీవ వైవిధ్యానికే ప్రమాదం వచ్చింది. వందల ఎకరాల్లో హైకోర్టు నిర్మాణానికి పూనుకోవడంతో అరుదైన వృక్ష జాతులు, అంతరించిపోయే జీవజాతులు, అంతకు మించిన వ్యవసాయ పరిశోధనలకు నిలయంగా ఉన్న అగ్రి బయో డైవర్సిటీ పార్కులో జంతుజాలం ఆవాసం కోల్పోనున్నది. ఇన్నాళ్లూ జంతుజాలానికి కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు నిర్మాణలు పుంజుకొంటే పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంద’ని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎంతో అరుదైన జంతు, వృక్ష, జీవ సంపదకు నిలయంగా ఉన్న పార్కును పరిరక్షించుకోవాలని పిలుపునిస్తున్నారు. గడిచిన కొంతకాలంగా ఈ పార్కును అభివృద్ధి చేయడంతోపాటు ఇక్కడి జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేసిన సంస్థలతోపాటు వర్సిటీ విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాలు, పర్యావరణ ప్రేమికులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన వ్యవసాయ విశ్వవిద్యాలయ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని వర్సిటీ విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సచివాలయంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సత్యమూర్తి, జే సురేశ్, వీ సతీశ్, డీ వినయ్, భరత్ తదితరులు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘనందన్‌రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. క్రాప్ కాలనీలు, విత్తన అభివృద్ధి, వ్యవసాయ అవసరాలు, పరిశోధనలు, అనేక కొత్త రకాల వంగడాలు, ఇతర పర్యావరణపరమైన వాటికి అనువుగా ఉండే ప్రాంతాన్ని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా హైకోర్టుకు కేటాయించడాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయంతోపాటు హార్టికల్చర్ యూనివర్సిటి కార్యకలాపాలు సాగుతాయని, నిర్మాణ సమయంలో అక్కడి వాతావరణానికి, పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తి పరిశోధనలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. నగరంలో అనేకచోట్ల ప్రభుత్వ స్థలాలున్నాయని, హైకోర్టుకు అక్కడ స్థలం కేటాయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
నూతన హైకోర్టు నిర్మాణానికిగానూ ఉద్యాన వర్సిటీకి చెందిన 57 ఎకరాలను తీసుకుంటున్న ప్రభుత్వం.. ఆ స్థానంలో యూనివర్సిటీకి 100 ఎకరాల స్థలం కేటాయించాలని ఆ వర్సిటీ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం యూనివర్సిటీ భూమిని హైకోర్టుకు ఇవ్వడంపై చర్చించేందుకుగానూ సమావేశం నిర్వహించారు. పరిశోధనలకు ఉపయోగపడుతున్న భూమిని హైకోర్టుకు కేటాయించడాన్ని తప్పుపట్టారు. ఒకవేళ తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే ఉద్యాన పరిశోధనలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకుగానూ యూనివర్సిటీకి 100 ఎకరాలు కేటాయించాలని కోరారు. హైకోర్టు కేటాయించిన భూమిలో ఉద్యాన యూనివర్సిటీకి చెందిన ఔషధ, సుగంధ ద్రవ్య మొకల పరిశోధన స్థానం, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ పరిశోధన స్థానం, మోడల్ ఆర్చర్డ్, కూరగాయల పరిశోధన స్థానం, ఏఐసీఆర్పీపీ సీమ్లతో నడిచే పరిశోధన స్థానం ఉన్నదని చెప్పారు. ప్రత్యేకించి 40 ఏండ్ల నుంచి పరిశోధన చేస్తున్న బహువార్షిక ఔషధ, సుగంధ ద్రవ్య మొక లు, వందలాది జర్మ్ ప్లాజం, అలాగే రైతులకు ఉపయోగపడే నూనెతీత యంత్రాలు, దీనికి తోడు పీజీ, పీహెచ్డీ విద్యార్థుల పరిశోధనకు యూజీ బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థుల ఎక్స్పీరియన్సియల్ లర్నింగ్ ప్రోగ్రాంకు సంబంధించిన ఇన్స్రక్షనల్ ఫామ్స్ ఇందులో ఉన్నాయని తెలిపారు. ఒకవేళ యూనివర్సిటీకి అదనపు స్థలం కేటాయించని పక్షంలో ఉద్యాన పరిశోధనలు కుంటుపడుతాయని, ఇది రాష్ట్ర వ్యవసాయరంగంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవసాయ, ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించడం తగదని, ఈ భూ కేటాయింపు జీవోను వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ వర్సిటీ ప్రాంగణంలో హైకోర్టును నిర్మించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ ప్రకటించారు. వ్యవసాయరంగం, రైతులను పటిష్ఠం చేసేందుకు పరిశోధనలు చేస్తున్న ఈ వర్సిటీని కాపాడుకుంటామని, గుంట భూమిని కూడా వదలబోమని తెలిపారు.
రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 70-80 ఎకరాల పరిధిలో ఆగ్రో ఫారెస్ట్రీ ఉన్నది. 1987లో ఓ పరిశోధన ప్రాజెక్టుగా దీన్ని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ పరిధిలో మరో 130 ఎకరాల్లో అగ్రి బయోడైవర్సిటీ పార్కు ఉన్నది. 2010లో అప్పటి సీఎం రోశయ్య దీన్ని ప్రారంభించారు. వైవిధ్యమైన వృక్షజాతులు, పక్షులు, కీటకాలుసహా అత్యంత అరుదైన జీవజాతులకు ఇది నిలయంగా మారింది. ఏండ్ల తరబడి వాటికి అనువైన పరిస్థితులు కల్పించడం వల్లే ఇవన్నీ ఇక్కడ వృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాగా, నాడు కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైన అగ్రి బయోడైవర్సిటీ పార్కు… అదే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రూపురేఖలు కోల్పోనున్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అగ్రి బయోడైవర్సిటీ పార్కు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందు వచ్చారు. ముఖ్యంగా పార్కులో మౌలిక వసతులు, మొక్కల పెంపకంతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్ కూడా ముందుకు వచ్చింది. ప్రాజెక్టు అభివృద్ధికి అగ్రి వర్సిటీతో కలిసి నిధులను సమీకరించింది. నిరుడు అగ్రికల్చర్ వర్సిటీతో కలిసి చెరువులు, కుంటల సంరక్షణకు కృషి చేసింది. దాదాపు 300 మొక్క జాతులను పెంచేందుకు సాయమందించినట్టు నిర్మాణ్ సంస్థ ప్రతినిధి తిరుపతి వెల్లడించారు. తాజాగా, కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఇక్కడి దశాబ్ద కాలంగా అభివృద్ధి చేసిన పర్యావరణానికి ముప్పు వాటిల్లనున్నదని ఆ సంస్థ ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతికి నిలయంగా ఉన్న పదుల ఎకరాల భూముల్లో నిర్మాణ పనులు చేపడితే.. జంతుజాలం ఆవాసం కోల్పోయే ప్రమాదం ఉన్నదని అంటున్నారు. ముఖ్యంగా అరుదైన అతి చిన్న వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పచ్చదనం, పర్యావరణమే కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.