హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : దుక్కిదున్ని సాగుచేసి ఫలసాయం పొందే వరకూ ప్రతిదశలోనూ రైతులకు చట్టపరంగా సాయమందించటం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ప్రధాన ధ్యేయమని రాష్ట్ర న్యాయసేవా సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్ పీ నవీన్‌రావు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఈ క్లినిక్‌లను తెలంగాణలో ప్రారంభించామని, వీటిపై దేశం మొత్తం ఆసక్తి కనబరుస్తున్నదని చెప్పారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, నల్సార్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న పారా వలంటీర్ల రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నల్సార్ వర్సిటీలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను విజయవంతం చేయాల్సిన బాధ్యత పారా వాలంటీర్లపైనే ఉన్నదన్నారు. రైతులకు భూమి, నీరు, క్రిమిసంహారక మందులు, మార్కెటింగ్ చట్టాలపై అవగాహన కల్పించటంలో ఈ క్లినిక్‌లు కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు. అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ఆలోచన ఆరు నెలల క్రితమే వచ్చిందని, వెంటనే బమ్మెర పోతన వ్యవసాయం చేసిన బమ్మెర గ్రామంలో ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 67 అగ్రి లీగల్ క్లినిక్‌లను ప్రారంభించామని, 178 మంది పారా లీగల్ వలంటీర్లుగా నియమితులయ్యారని వెల్లడించారు.
గ్రామీణ రైతులకు ప్రయోజనకారి
అన్యాయం జరిగిందని భావించే రైతులు కోర్టులకు వెళ్లకుండా ఈ వ్యవస్థ ద్వారా లబ్ధిపొందవచ్చని జస్టిస్ నవీన్‌రావు వివరించారు. రైతులకు చట్టాలపై అవగాహన తక్కువని, వారికి న్యాయం అందించేందుకే న్యా య సేవాసంస్థలున్నాయని తెలిపారు. గ్రామస్థాయి రైతులకు కోర్టులు న్యాయమందించటం కష్టమని, ఈ సమస్యను అధిగమించి రైతులకు న్యాయం అందించటమే పారా వలంటీర్ల బాధ్యతని గుర్తు చేశారు. తాను రైతు కుటుంబంలో పుట్టానని, రైతు సమస్యలెలా ఉం టాయో తనకు తెలుసునని చెప్పారు. ధరణి పోర్టల్‌లో సమస్య ఉంటే దానిని ఎలా పరిష్కరించుకోవాలో రైతులకు వలంటీర్లు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమస్యలకు చట్టాల ద్వారా పరిష్కారమార్గాలను కూడా తెలియజేస్తామని చెప్పారు. రైతులకు సత్వర న్యాయం అందించటానికి ఈ క్లినిక్‌లు దోహదం చేస్తాయని నల్సార్ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ శ్రీకృష్ణదేవరావు చెప్పారు. జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో వలంటీర్లు హాజరయ్యారని, శిక్షణ ఫలితాలు గ్రామస్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చట్టాలపై న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ అధ్యక్షుడు సునీల్‌కుమార్, రిసోర్స్ పర్సన్స్, ట్రైనీ పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.