సంగారెడ్డి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో హరీశ్‌రావు నగరబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే మాణిక్‌రావుతో కలిసి పలు వార్డుల్లో సైకిల్‌పై పర్యటించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. నిమ్జ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. మొదటి దశ ప్రారంభానికి పర్యావరణంతోపాటు అన్ని అనుమతులు వచ్చినట్టు తెలిపారు. నిమ్జ్‌లో త్వరలోనే అతిపెద్ద డిఫెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానున్నదని చెప్పారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందన్నారు. డిఫెన్స్ ఫ్యాక్టరీతోపాటు అనేక కంపెనీలు నిమ్జ్‌కు రానున్నాయని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల ప్రారంభంతో స్థానిక నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటికి ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు.
నిమ్జ్ ఏర్పాటుతో జహీరాబాద్ నియోజకవర్గం గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గోదావరి జలాలను జహీరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఇటీవల రూ.3 వేల కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను సింగూరుకు తీసుకొచ్చి అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలోని పంటపొలాలకు అందిస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మొగుడంపల్లి మండలం తెలంగాణలోనే అత్యంత ఎత్తులో (650 మీటర్లు) ఉన్నదని, ఇక్కడి గ్రామాలకు సైతం గోదావరి జలాలు అందజేయనున్నట్టు తెలిపారు.
ఇటీవలే సీఎం కేసీఆర్ జహీరాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయగా, ఆ నిధులతో మురికికాల్వలు, సీసీరోడ్లు, కమ్యూనిటీ హాళ్లను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.19 కోట్లతో పైప్‌లైన్, రెండు ట్యాంకులను నిర్మిస్తున్నట్టు చెప్పారు.
సైకిల్ తొక్కుతూ.. సమస్యలు తెలుసుకొంటూ
జహీరాబాద్‌లో నగరబాట ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే మాణిక్‌రావు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి పట్టణంలో సైకిల్‌పై పర్యటించారు. రామ్‌నగర్, డ్రైవర్ కాలనీ, హమాలీకాలనీ, గాంధీనగర్, గడీ, మాణిక్ ప్రభు మొహల్లా, కసబ్ గల్లీల్లో సైకిల్‌పై తిరిగారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకొన్నారు. రామ్‌నగర్, డ్రైవర్స్ కాలనీ, గాంధీనగర్, గడీ తదితర ప్రాంతాల్లో మురికి కాల్వలు, రోడ్లు, కల్వర్టులు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. త్వరలోనే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో సైకిల్ యాత్ర చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ నాయకులు చింతా ప్రభాకర్, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.