హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో బయో ఫ్యూయెల్స్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ‘స్వచ్ఛ్ బయో’ అనే కంపెనీ ముందుకొచ్చింది. సోమవారం న్యూయార్క్‌లో జరిగిన చర్చల అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ చైర్మన్ ప్రవీణ్ పరిపాటి ఎంవోయూ కుదుర్చుకున్నారు. మొదటిదశలో దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నిర్మించనున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటులో 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. స్వచ్ఛ బయోతో అంతర్జాతీయ భాగస్వామిగా ఉన్న సుగనిత్ బయో రెన్యువబుల్స్ కంపెనీ బయోమాస్, సెల్యులోజ్ నుంచి జీవ ఇంధనాలు, జీవ రసాయనాలను ఉత్పత్తి చేసే పేటెంట్ పొందటంతోపాటు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసింది.
లేని కంపెనీతో ఒప్పందమా?
‘స్వచ్ఛ్ బయో’ కంపెనీతో ఒప్పందంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. స్వచ్ఛ్ బయో అనే కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ గానీ, సోషల్ మీడియా ఖాతాగానీ లేకపోవడంతో పులువురు అనుమానాలు వ్యక్తం చేశారు. స్వచ్ఛ్ బయో పేరుతో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో ఎటువంటి సంస్థ నమోదు కాలేదని, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలో కూడా దీని వివరాలు లభ్యం కాలేదని అంటున్నారు. కంపెనీస్ చెక్ వెబ్సైట్లో వెతికినా దాని జాడ కానరాలేదని వాపోతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో స్వచ్ఛ్ బయో చైర్మన్‌గా ప్రవీణ్ పరిపాటి అని పేర్కొనగా.. అసలు ఆయన పేరుతో ఆ కంపెనీ లేకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్వచ్ఛ్ బయోకు దాదాపు దగ్గరగా ‘స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఓ కంపెనీ ఉన్నట్టు గుర్తించారు.
ఈ కంపెనీని 2024 జూలై 21న హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్ చేశారని అంటున్నారు. ఈ కంపెనీకి సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు ఎనుముల జగదీశ్వర్‌రెడ్డి, వేదపల్లి శివానందరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నట్టు తెలిపారు. దీని షేర్ క్యాపిటల్ రూ.10 లక్షలుగా వెల్లడించారు. కంపెనీల పేర్లు దగ్గరగా ఉండటం కాకతాలీయమా లేక? ఏదైనా మతలబు ఉన్నదా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం సమక్షంలో కంపెనీ చైర్మన్‌గా పేర్కొన్న ‘ప్రవీణ్ పరిపాటి’ అమెరికాకు చెందిన శాస్త్రవేత్త అని, ఆయన ‘సుజెయింట్’ అనే బయోటెక్నాలజీ కంపెనీకి చెందినవారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛ్ బయో కంపెనీ, స్వచ్ఛ్ బయోగ్రీన్ కంపెనీ ఒక్కటేనా? దానికి చైర్మన్ ప్రవీణ్ పరిపాటియేనా? అని అనుమానిస్తున్నారు. కేవలం 15 రోజుల కిందట ప్రారంభమైన కంపెనీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి ఎలా పెట్టగలదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ముఖ్యమం త్రి కార్యాలయం వివరణ ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో అపార అవకాశాలు
న్యూయార్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వరింగ్ లంచ్ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ, బయోటెక్, షిప్పింగ్ రంగా ల్లో పేరొందిన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమని అన్నారు. తెలంగాణలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు.
మీ జీవితం స్ఫూర్తిదాయకం
న్యూయార్‌లోని భారత అంధుల క్రికెట్ జట్టు (బాలుర)ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. అమెరికా పర్యటనలో ఉన్న జట్టు సభ్యులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ జట్టును కలుసుకునే అవకాశం రావటం ఎంతో అమూల్యంగా భావిస్తున్నానని.. ఈ టీమ్ ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఎన్ని అడ్డంకులున్నా ఎదిరించి నిలబడాలనే మానసిక సె్థైర్యాన్ని వాళ్ల నుంచి నేర్చుకోవాలని సూచించారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్‌లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్
హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సెంటర్ నెలకొల్పేందుకు ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు బృందం తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్‌పై చర్చలు జరిపారు. మరో ఆరు నెలల్లో తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. రాబోయే మూడేండ్లలో వెయ్యికిపైగా ఉద్యోగాలను కల్పించనున్నట్టు తెలిపింది. డాటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఈ సంస్థ అందిస్తున్నది. సుమారు రూ.1350 కోట్ల ఆదాయం కలిగిన ఈ కంపెనీలో 2500 మంది ఉద్యోగులుండగా వారిలో వెయ్యి మంది భారత్‌లో, సుమారు వంద మంది హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు.
ఆర్సీసీఎం విస్తరణ…
టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్‌లో పేరొందిన ఆర్సీసీఎం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బృం దంతో ఆ కంపెనీ సీఈవో గౌరవ్ సూరి భే టీ అయ్యారు. ఆర్సీసీయం మొదటిసారిగా హైదరాబాద్‌లో తమ ఆఫీసును విస్తరించనుంది. ఆ సంస్థ అమెరికా వెలుపల కంపెనీ పెట్టడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే రెండేండ్లలో హైదరాబాద్‌లో 500 మంది సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది.