హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర నిఘా వర్గాల వైఫల్యం..ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) అధికారుల అలసత్వం.. వెరసి ప్రశాంత రాష్ర్టాల్లో ఆందోళన చిచ్చుపెట్టాయి. కోట్లాది రూపాయల విలువైన రైళ్లు, రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ రేపిన అగ్నిపథ్ చిచ్చులో ఓ తెలంగాణ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. దేశవ్యాప్తంగా మొదటి నుంచీ ఈ పథకాన్ని యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశ సేవ చేసేందుకు భారత సైన్యంలో చేరాలన్న తమ కలలను బీజేపీ ప్రభుత్వ నిర్ణయం కల్లలుగా చేస్తున్నదని ముక్త కంఠంతో నినదిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వందల సంఖ్యలో రైల్‌రోకోలు, రైల్వేస్టేషన్ ప్రాంగణాల్లో ఆందోళనలు జరిగాయి. కానీ, శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన తరహాలో విధ్వంసాలు తలెత్తలేదు. ఉద్యమ సమయంలో, అంటే 2014కి ముందు మాత్రమే స్వరాష్ట్ర ఆందోళనలో ఉన్న విద్యార్థులపై టియర్‌గ్యాస్ షెల్స్, రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం జరిగింది. కానీ, రాష్ట్రం వచ్చిన తర్వాత శాంతిభద్రతల అంశంలో దేశానికే ఆదర్శంగా ఉన్న తెలంగాణలో నిరుద్యోగ యువతపై రైల్వే పోలీసుల తూటా పేలేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్ణయం కారణమైంది. కేంద్రం తెచ్చిన ఈ పథకం వల్ల యావత్ దేశం ఇప్పుడు ఆందోళనల బాట పట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న రాష్ర్టాల్లో బీజేపీ చిచ్చు రాజేస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అగ్నిపథ్ ప్రకటించిన నాటి నుంచే సోషల్ మీడియా వేదికగా యువతలో తీవ్ర చర్చ మొదలైంది. ఆందోళన చేసైనా ఆర్మీ జాబ్స్ కాపాడుకుందామంటూ తీర్మానించుకొన్నారు. దీనంతటినీ కేంద్ర నిఘావర్గాలు పసిగట్టలేదంటే విస్మయం కలుగుతుంది. ఇప్పటికే రోడ్లపైకి యువత వచ్చి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ర్టాలను అప్రమత్తం చేయాల్సింది కేంద్రమే. కానీ అది జరగలేదు. ఇతర రాష్ర్టాల్లో రైల్‌రోకోల నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అప్రమత్తం కావాలి. కానీ, అదీ జరగలేదు. ఫలితంగా ఒకేసారి వందల మంది నిరుద్యోగులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపలికి దూసుకు వచ్చి బీభత్సం సృష్టించారు. స్టేషన్ లోపలికి చేరుతున్న నిరుద్యోగులను గుర్తించి వారిని నిలువరించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైల్వే స్టేషన్ల లోపల భద్రత కోసమే ప్రత్యేకంగా నియమించిన ఈ బలగాలు ఆ పనిలో పూర్తిగా విఫలమయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితి అదుపు తప్పడంలో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు గంటలపాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు.