పరిగి, సెప్టెంబర్ 26 : ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. మెడకు ఉరితాళ్లు వేసుకొని వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద పనులు చేపట్టి ఏడాది గడిచినా బిల్లులు చెల్లించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుల కోసం వినతిపత్రాలు అందజేసినా స్పందించకపోవడంతో ఉరి తాళ్లతో నిరసన చేపట్టాల్సి వచ్చిందని అన్నారు. బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి పనులు చేపట్టామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు చెల్లించాలని, లేకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని అన్నారు.
దేశవ్యాప్తంగా ఓపీఎస్ అమలుచేయాలి ; ఎన్‌ఎంవోపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్) అమలుచేయాలని, సోమనాథన్ కమిటీ రిపోర్టును బహిర్గతపర్చాలని ఎన్‌ఎంవోపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ సీం(ఎన్‌ఎంవోపీఎస్) ఆధ్వర్యంలో ఆగస్టు 24న కేంద్ర క్యాబినెట్ నిర్ణయించిన ఏకీకృత పెన్షన్ విధానాన్ని(యూపీఎస్) వ్యతిరేకిస్తూ గురువారం దేశవ్యాప్తంగా పెన్షన్ ఆక్రోశ్ మార్చ్ పేరిట నిరసనలు తెలిపారు. తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని బీమా భవన్లో నిర్వహించిన నిరసనలో స్థితప్రజ్ఞ మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేశ్‌గౌడ్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు సం దీప్, రెడ్డప్ప, మదన్‌రాజ్ పాల్గొన్నారు.