న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశీయ రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ రూటే సపరేటు. సర్వే కావచ్చు.. నివేదిక కావచ్చు.. ఎందులోనైనా భాగ్యనగరానిదే బంపర్ మెజారిటీ. కరోనా దెబ్బకు నిర్మాణ రంగం కుదేలైనా.. హైదరాబాద్‌కున్న ఆదరణ మాత్రం తగ్గలేదు. అందుకే ఇల్లు కొందామన్నా.. ఆఫీస్ పెడదామన్నా.. ఇక్కడే అంటున్నారంతా. ఇటీవల విడుదలైన నైట్ ఫ్రాంక్ లెక్కలైనా.. ఇప్పుడు వచ్చిన ప్రాప్‌టైగర్, జేఎల్ఎల్ ఇండియా రిపోర్టులైనా ఇదే చెప్తున్నాయి మరి. దేశంలోని ఇతర పోటీ నగరాలతో పోల్చితే.. హౌజింగ్ సేల్స్, ఆఫీస్ స్పేస్ లీజుల్లో హైదరాబాద్ దూసుకుపోతున్నది. చాలా ప్రముఖ నగరాల్లో గతంతో పోల్చితే ఇండ్ల అమ్మకాలు, కార్యాలయ స్థల లీజులు తగ్గుతున్నా.. హైదరాబాద్‌లో మాత్రం డిమాండ్ కనిపిస్తుండటం విశేషం.
హౌజింగ్‌లో 38% డిమాండ్
గతేడాది జనవరి-మార్చితో పోల్చితే ఈ జనవరి-మార్చిలో హైదరాబాద్ హౌజింగ్ సేల్స్ 38% పెరిగాయి. ‘రియల్ ఇన్సైట్-క్యూ1 2021’ పేరుతో రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈసారి హైదరాబాద్‌లో 7,721 యూనిట్లు అమ్ముడయ్యాయి. నిరుడు 5,554 ఇండ్ల విక్రయాలు జరిగాయి. హైదరాబాద్‌సహా ఢిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, పుణెల్లోని అమ్మకాల వివరాలను ప్రాప్‌టైగర్ వెల్లడించింది. వీటిలో బెంగళూరు (9%), ముంబై (23%), పుణె (12%)ల్లో హౌజింగ్ సేల్స్ పడిపోయాయి. ఇక మిగతా నగరాల్లో పెరిగినా.. హైదరాబాద్‌తో పోల్చితే అటు ఇండ్లు, ఇటు వృద్ధిపరంగా తక్కువ కావడం గమనార్హం.
ఆఫీస్ స్పేస్‌లో అదుర్స్
కొత్త కార్యాలయాల ఏర్పాటు కోసం జరిగే ఆఫీస్ స్పేస్ లీజుల్లోనూ హైదరాబాద్ ముందున్నది. గతంతో పోల్చితే ఈ జనవరి-మార్చిలో 0.2 మిలియన్ చదరపు అడుగుల మేర నికర లీజులు పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ-ఎన్సీఆర్లలో తగ్గిపోవడం గమనార్హం. ముఖ్యంగా ముంబైలో లీజింగ్ స్తంభించిపోయింది. భారీగా పెరుగుతున్న కరోనా కేసులూ ఆఫీస్ మార్కెట్‌ను దెబ్బతీశాయి.
ప్రతికూలంలోనూ ప్రగతి
కరోనా వైరస్ ధాటికి అన్ని రంగాలు కుప్పకూలాయి. ముఖ్యంగా నిర్మాణ రంగంపై మహమ్మారి పెను ప్రభావమే చూపింది. ఇక రియల్ ఎస్టేట్ పని అయిపోయిందనుకున్న వేళ.. యావత్ భారతీయ రియల్టీకే ఇప్పుడు హైదరాబాద్ ఓ ఆశా కిరణంగా కనిపిస్తున్నది. ప్రతికూల పరిస్థితుల్లోనూ భాగ్యనగర రియల్టీ.. ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది మరి. ఇందుకు కారణాలూ లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, మౌలిక వసతుల కల్పన, నైపుణ్యం-ప్రతిభ కలిగిన యువతకు కొదవ లేకపోవడం వంటివి ఇక్కడి రియల్టీని పరుగులు పెట్టిస్తున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్లు విశ్లేషిస్తున్నారు.