హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : బడికి రాకుండా పాఠాలు చెప్పకుండా స్కూల్‌కు గైర్హాజరవుతున్న టీచర్లను గాడినపెట్టేందుకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు(ఎఫ్ఆర్ఎస్) అస్ర్తాన్ని పాఠశాల విద్యాశాఖ అమలుచేయనున్నది. విధులకు గైర్హాజరవుతున్న వారిని కట్టడిచేయనున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ హాజరు అమలుచేయనున్నది. ఇందుకు అనుమతించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ సర్కారుకు ప్రతిపాదనలు పంపించింది. నెలరోజుల క్రితమే సర్కారుకు చేరినా.. దీనిపై ప్రభుత్వం ఇంత వరకు ఏదీ తేల్చలేదు. బడులు ప్రారంభమయ్యి నెలరోజుల కావస్తున్నది. అయినా స్పష్టత కరువయ్యింది.
కొంతమంది టీచర్లు ఇష్టానుసారంగా విధులకు గైర్హాజరవుతున్నారు. కొద్దిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం మయూరీనగర్ పాఠశాలలో ఓ టీచర్ విధులకు గైర్హాజరవడమే కాకుండా.. తనకు బదులు విద్యావలంటీర్‌ను పెట్టినట్టు తేలింది. దీంతో అధికారులు సదరు టీచర్‌ను సస్పెండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ టీచర్ విధులకు గైర్హాజరై ఎంచక్కా వేతనాలు పొందింది. నిరుడు జగిత్యాల జిల్లాలో ఓ టీచర్ ఏకంగా 20 ఏండ్లపాటు విధులకు గైర్హాజరైన ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్‌లోని కొందరు టీచర్లు దుబాయ్, సౌదీ వంటి దేశాల్లో టీచర్లుగా పనిచేస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది. ఇక మారుమూల ప్రాంతాల్లోని బడుల్లో ఇద్దరు టీచర్లు ఉంటే రోజుకు ఒకరు చొప్పున వంతులేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి. భద్రాద్రికొత్తగూడెం, ములుగు, నల్లగొండ జిల్లాల్లో ఇలాంటివి అనేకం జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
పెద్దపల్లి జిల్లాలో పైలట్ పద్ధతిలో టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ హాజరును అమలుచేస్తున్నారు. సర్కారు ఆమోదం తెలిపితే రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమలుచేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. టీచర్ల హాజరు నమోదుకు ప్రస్తుతం రిజిస్టర్లు వాడుతున్నారు. ఈ విధానంలో కొందరు టీచర్లు విధులకు హాజరుకాకున్న తాపీగా మరుసటి రోజు వచ్చి సంతకాలు పెడుతున్నట్టు విద్యాశాఖ గుర్తించింది. దీనికి అడ్డుకట్టవేసేందుకే విద్యాశాఖ ఎఫ్‌ఆర్‌ఎస్‌ను వినియోగించనున్నది. టీచర్లకు గతంలో కొన్ని జిల్లాల్లో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరు(ఏబీఏఎస్), మరికొన్ని జిల్లాల్లో జియో అటెండెన్స్‌ను అమలుచేశారు. అంతకు ముందు బయోమెట్రిక్ హాజరును సైతం అమలుచేశారు. తాజాగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అధికారులు ముందుకు తెచ్చారు.