Maoist Radha | కాప్రా, ఆగస్టు 23: ‘అమ్మా, నాకు ఉద్యోగం దొరకబోతోంది, త్వరలోనే మన కష్టాలు తీరుతాయి’ అందరూ జాగ్రత్తగా ఉం డండి అంటూ ఇంటి నుంచి వెళ్లిన పల్లెపాటి రాధ అటు నుంచి అటే అదృశ్యమై పోయిందనీ, ఏడేండ్ల తర్వాత విగతజీవిగా తిరిగి వచ్చిందని మావోయిస్టు రాధ అలియాస్ నీల్సో తల్లిదండ్రులు పల్లెపాటి పోచమ్మ, పల్లెపాటి బాలయ్య భోరున విలపిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పల్లెపాటి బాలయ్య జీవనోపాధి కోసం కుటుంబంతో 35 ఏండ్ల క్రితం కాప్రాలోని ఇందిరానగర్‌కు వచ్చాడు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రాధ అలియాస్ నీల్సో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (డీఎంఎల్టీ)కోర్సు పూర్తి చేసింది. మహిళలను చైతన్యం చేసేందుకు, వరకట్న దురాచారాలను, మద్యం వంటి చెడు అలవాట్లనుంచి కుటుంబాలను దూరం చేసేందుకు ఆమె స్వచ్ఛంద సంస్థలో చేరింది. చక్క టి గొంతు, తెలివితేటలు, సమాజాన్ని చైతన్యపరిచాలనే దృక్పథం నచ్చి ఆమెను స్వచ్ఛంద సంస్థ వారు చేర్చుకున్నారు.
ఆ సంస్థవారే తమ బిడ్డను ఉద్యమం బాట పట్టిస్తారని ఊహించలేదని తల్లిదండ్రులు వాపోతున్నా రు. 2017లో 17 ఏండ్ల వయస్సులో రాధ తమను విడిచి వెళ్లిందని, ఎంత వెతికినా దొరకలేదని చెప్పారు. ఆమె మావోయిస్టుల దళం లో చేరినట్టు మూడేండ్ల క్రితం తెలిసిందని అన్నారు. ఈ నెల 19న ఆమె మృతి చెందిందని, భద్రాచలం వద్ద మృతదేహం ఉన్నట్టు సమాచారం వచ్చిందని తెలిపారు. రాధను ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులే చంపారని చెప్పారు. ఆమె ఉద్యమానికి ద్రోహం తలపెట్టే వ్యక్తి అయితే ఏడేండ్లు ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. దళితురాలు అయినందునే కోవర్టు ఆరోపణతో హతమార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంతోమంది ఎన్నో ఏండ్లు నక్సల్స్‌గా పనిచేసి ఏదో ఒక దశలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని, తన బిడ్డకు మాత్రం ఆ అవకాశం లేకుండా చేశారని విలపించారు. ‘ఏడేండ్లు సేవ చేయించుకున్నారు, నా బిడ్డను ఎలా చంపాలనిపించిందయ్యా మీకు’ అని తల్లి పోచమ్మ గొల్లుమంది. పేదరికంలో ఉన్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.