మానకొండూర్, సెప్టెంబర్ 1 : కరీంనగర్ జిల్లా మానకొండూర్ పీహెచ్సీలో ఓ గర్భిణికి 4 కిలోల బరువుగల బాలుడు జన్మించాడు. బీహార్‌కు చెందిన అఖిలేష్, కాజల్దేవి దంపతులు రెండేండ్ల క్రితం బతుకుదెరువు కోసం మానకొండూర్ వచ్చి కోళ్లఫారంలో కూలీలుగా పనిచేస్తున్నారు. వారికి ఇదివరకే ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఆరోసారి గర్భం దాల్చిన కాజల్దేవికి సోమవారం పురిటి నొప్పులు రావడంతో మానకొండూర్ పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. కాజల్దేవి సాధారణ ప్రసవంలో నాలుగు కిలోల బాబుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యసిబ్బంది తెలిపారు.