హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోట మళ్లీ అదే ఫ్రస్ట్రేషన్‌తో కూడిన మాటలే వినిపించాయి. రాష్ట్రంలో తీవ్ర రాజకీయ సంక్షోభంలో అధికార కాంగ్రెస్ కూరుకుపోవడం, తనపై పార్టీలో, ప్రభుత్వంలో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి తనలో ఉన్న ఆక్రోశాన్ని తెలంగాణ సాధకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించాల్సిన వేదికను ప్రతిపక్ష బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆరోపణలు చేయడానికి వాడుకోవడం గమనార్హం.
ముఖ్యంగా వ్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యలు, తీవ్ర ఉపమానాలు సీఎం రాజకీయ భాషపై మరోసారి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కేసీఆర్‌తో తనకు పోలికే లేదంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ‘నక్కకు నాకలోకానికి.. నందికి పందికి ఉన్నంత తేడా ఉన్నది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘కేసీఆర్ తెలంగాణకు నంది.. రేవంత్‌రెడ్డి ఏమిటో ఆయనకే తెలుసు’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్న సమయంలో సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి తన పార్టీ శ్రేణులను రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలనడం విడ్డూరంగా ఉన్నదని రాజకీయ విశ్లేషకులే విస్తుపోతున్నారు. సీఎం పదవిలో ఉన్నవారు హుందాగా మాట్లాడాలి కానీ, రేవంత్‌రెడ్డి చవకబారు మాటలు మాట్లాడుతున్నారని, తనకన్నా వయసులో, అనుభవంలో పెద్దవాడైన కేసీఆర్‌పై అసందర్భ ప్రేలాపనలకు దిగారని విమర్శిస్తున్నారు.
రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే. కానీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో విమర్శలకు ఒక పరిమితి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. ప్రత్యర్థి విధానాలు, పాలన, నిర్ణయాలను విమర్శించడం ఒకెత్తయితే.. వ్యక్తిగత పోలికలు, అవమానకరమైన ఉపమానాలు ఉపయోగించడం మరో ఎత్తు. గతంలోనూ రేవంత్‌రెడ్డి ఇలానే మాట్లాడి తీవ్ర విమర్శలు రావడంతో కొంత వెనక్కు తగ్గారు. కానీ ఇటీవల మంత్రి కొండా సురేఖ ఉదంతం, తాజగా ఆయన సోదరుడి కంపెనీ టెస్సెరాక్ట్ బండారం బయటపడటంతో ఏంచేయాలో పాలుపోక ప్రతిపక్ష బీఆర్ఎస్పై, మాజీ సీఎం కేసీఆర్‌పై నోరుపారేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చకు తెరతీయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న సమయంలో ఉక్కిరిబిక్కిరవుతున్న సీఎం నేరుగా కేసీఆర్‌పై దాడికి దిగారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై చర్చ జరుగాల్సిన సమయంలో చర్చను తిరిగి గత ప్రభుత్వంపైకి మళ్లించే వ్యూహంగా దీన్ని చూడాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల కూడా కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై రేవంత్‌రెడ్డి తీవ్ర ఫ్రస్ట్రేషన్‌తో స్పందించారు. దాన్ని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రగా అభివర్ణించారు.
వెయ్యి రోజుల పాలనలో తమ ప్రభుత్వం ఏం చేసింది? ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయ్యాయి? ఇంకా ఎన్ని మిగిలాయి? అనేది సీఎం వివరించలేదు. రైతులు, యువత, మహిళలు, సంక్షేమం, పెట్టుబడులు, కొలువుల విషయంలో ప్రభుత్వం సాధించిన పురోగతి ఏమిటి? అనేదీ చెప్పలేదు. అవన్నింటిలోనూ వైఫల్యాలే మూటగట్టుకోవడం, చెప్పేందుకు చేసిందేమీ లేకపోవడంతో కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై నోటికొచ్చినట్టు మాట్లాడేందుకే రేవంత్‌రెడ్డి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాటల్లో మంట పెంచుకోవడం రాజకీయంగా తాత్కాలిక ఉత్సాహాన్ని ఇవ్వొచ్చు గానీ వాస్తవాలను కప్పిపుచ్చలేవని, ముఖ్యమంత్రి స్థాయి నుంచి వచ్చే మాటలు ప్రజలకు పాలనపై భరోసా కలిగించేలా ఉండాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.