హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోపు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు ఇంటర్ బోర్డు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నది. అందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా సోమవారం ఇంటర్ కాలేజీల అనుబంధ గుర్తింపు షెడ్యూల్‌ను బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ విడుదల చేశారు. కాలేజీల అనుబంధ గుర్తింపు కోసం ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 21 వరకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలని నవీన్‌మిట్టల్ సూచించారు. ఆలస్య రుసుముతో మార్చి 31 వరకు దరఖాస్తు సమర్పించవచ్చని తెలిపారు. ఏప్రిల్ 30లోపే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రదర్శించాలని గడువుగా పెట్టుకొన్నామని ఆయన పేర్కొన్నారు. కాగా, గత ఏడాది మే 31లోపు అనుబంధ కాలేజీల జాబితా ప్రకటనకు గడువుగా నిర్దేశించుకొన్న విషయం తెలిసిందే.
ఏటా ఆలస్యమే..
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపును పొందిన తర్వాతే నడపాల్సి ఉంటుంది. కొత్త కాలేజీల ఏర్పాటుకు అవకాశం లేదు. కానీ, ప్రస్తుతం నడుస్తున్న కాలేజీల్లో అదనపు సెక్షన్లకు ఏటా అనుబంధ గుర్తింపును పునరుద్ధరిస్తుంటారు. అయితే, గత కొంతకాలంగా అనుమతుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. జూన్ కంటే ముందే ముగియాల్సి ఉండగా, సెప్టెంబర్ వరకు ప్రక్రియ కొనసాగుతున్నది. అనుబంధ గుర్తింపు పొందకుండానే కాలేజీలు అడ్మిషన్లు తీసుకొంటున్నాయి. విద్యార్థులను చేర్చుకొంటున్నాయి. దీంతో ఏటా గందరగోళానికి దారితీస్తున్నది.
దరఖాస్తుల షెడ్యూల్ ఇలా
ఆలస్య రుసుము లేకుండా : 21-2-23
రూ.వెయ్యి ఆలస్య రుసుముతో: 28-2-23
రూ.5 వేల ఆలస్య రుసుముతో: 07-3-23
రూ. 10 వేల ఆలస్య రుసుముతో: 14-3-23
రూ.15 వేల ఆలస్య రుసుముతో: 21-3-23
రూ. 20 వేల ఆలస్య రుసుముతో: 31-3-23
దరఖాస్తుతో పాటు జత చేయాల్సినవి
చెల్లుబాటయ్యే భవన రిజిస్ట్రేషన్ డీడ్, లీజు డీడ్, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ ఎన్వో సీ, కార్పస్ ఫండ్, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికె ట్, శానిటరీసర్టిఫికెట్, సిబ్బంది డాక్యుమెంట్లు