చిక్కడపల్లి, జూలై 22: ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చిక్కడపల్లి పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన టి.శివారెడ్డి,(44) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో సార్జెంట్‌గా పని చేసి రిటైర్డ్ అయిన తర్వాత బాగ్‌లింగంపల్లిలోని మానస ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నాడు. అయితే శివారెడ్డి 2017లో తన భార్య రమతో విడాకులు తీసుకున్నాడు.
ఇటీవలే కడప వెళ్లిన ఆయన శుక్రవారం ఉదయం బాగ్‌లింగంపల్లికి చేరుకున్నాడు. ఇంట్లోకి వెళ్లిపోయి గడియ బిగించుకున్నాడు. కడపలో ఉండే సోదరి మహేశ్వరి శివారెడ్డికి పలుమార్లు ఫోన్ చేసినా ఎంతకూ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి కవాడిగూడలోని తన స్నేహితురాలు లక్ష్మి భవానికి విషయం చెప్పి వెళ్లి చూడమని చెప్పింది. లక్ష్మి భవాని మధ్యాహ్నం రెండు గంటలకు శివారెడ్డి ఫ్లాట్ వద్దకు వెళ్లింది. ఎంత పిలిచినా శివారెడ్డి పలకకపోవడంతో వాచ్మెన్ దుర్గాప్రసాద్ సాయంతో తలుపులు విరగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే శివారెడ్డి మృతదేహమై కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. శివారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.