హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఆధునిక వైద్యం ఖరీదైనదిగా మారిందని, దీన్ని తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత కంపెనీలు, ప్రభుత్వాలపై ఉన్నదని నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతిక రంగంలో జరుగుతున్నట్టే వైద్య రంగంలోనూ వినూత్న ఆవిష్కరణలు జరుగాలని, తద్వారా అందుబాటు ధరల్లో వైద్య సేవ లు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బయోఏషియా సదస్సులో ‘అందరికీ ఆరోగ్య సంరంక్షణ- విజయాలు, సవాళ్లు, తరువాత చేయాల్సిందేమిటి?’ అనే అంశంపై శుక్రవారం చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్యానలిస్టులుగా నేషనల్ హెల్త్ అథారిటీ అదనపు సీఈవో డాక్టర్ బసంత్ గార్గ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్యూచర్ ఆఫ్ హెల్త్, హెల్త్ కేర్ ప్రతినిధి డాక్టర్ శ్యామ్ బిషెన్, నార్త్ స్టార్ ఏషియా ఎల్ఎల్పీ సీఈఓ అన్నస్వామి వైదేశ్, ఎయిట్ రోడ్స్ ఇన్వెస్ట్మెంట్స్ సీనియర్ పార్ట్నర్ డాక్టర్ ప్రేమ్పవూర్, హుమన్ ఫార్మా ప్రతినిధి ఉదయ్ బోస్, రోచె ఫార్మా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సైమన్ ఎమాన్యుయేల్ పాల్గొన్నారు. అనుసంధానకర్తగా ఫార్మా అండ్ లైఫ్ లైన్సెస్ ఈటీ ప్రైమ్ ఎడిటర్ వికాస్ దండేకర్ వ్యవహరించారు.
మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య రంగం అత్యాధునికంగా ఉండాలి. ప్రస్తుతం ఆధునిక వైద్యం బాగా ఖరీదుగా మారిపోయింది. దీన్ని తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత కంపెనీలు, ప్రభుత్వాలపైన ఉన్నది. మా కంపెనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నది. ఎక్కువ మంది రోగులకు చికిత్స అందేలా చేస్తున్నాం. వైద్య, ఆరోగ్య రంగాల నిర్వహణ విషయంలో భాగస్వాములంతా కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
-సైమన్ ఎమాన్యుయేల్, సీఈవో, ఎండీ, రోచెఫార్మా ఇండియా
భారత్‌లో జనాభా చాలా ఎక్కువగా ఉన్నది. అందరికీ మెరుగైన వైద్య సేవలు అందాలి. ప్రస్తుతం అత్యాధునిక వైద్య సేవలు ఎంతో ఖరీదుతో కూడుకున్నవిగా మారాయి. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేయాలి. వైద్య ఉత్పత్తులు దేశంలోనే ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. హైదరాబాద్‌లో జరుగుతున్న బయోఏషియా సదస్సు వీటన్నింటికీ పరిష్కార మార్గాలు చూపేలా ఉండాలి. దీన్ని మంచి వేదికంగా భావించి, ఈ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాలి.
-డాక్టర్ బసంత్ గార్గ్, అదనపు సీఈవో, నేషనల్ హెల్త్ అథారిటీ
ఔషధ, జీవశాస్ర్తాల రంగంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆవిష్కరణలు, కొత్త విధానాలను తెలుసుకొనేందుకు బయోఏషియా సదస్సు చక్కని వేదిక. ఈసారి రికార్డు స్థాయిలో రెండు వేల మంది ప్రతినిధులు రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. 50 కన్నా ఎక్కువ దేశాల నుంచి వచ్చారు. ఇక్కడ ఎంతో అవసరమైన సమాచారం లభిస్తుంది. అర్థవంతమైన చర్చలు జరుగుతాయి. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్కు సంబంధించిన స్టార్టప్ షోకేస్, ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటుచేశాం. ఇక్కడి కంపెనీలు, ఆవిష్కరణలు తెలుసుకొనేందుకు అవకాశం కలుగుతుంది.
-జయేశ్‌రంజన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి
లైఫ్‌సైన్సెస్, ఔషధ రంగంలో తెలంగాణ ఎంతో ముందున్నది. కొవిడ్ సమయంలో ఈ విషయం ప్రపంచానికి అర్థమైంది. ఈ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయి. బయోఏషియా సదస్సును విజయవంతంగా నిర్వహించడంలో మంత్రి కేటీఆర్ ఎంతో కృషిచేస్తున్నారు. సదస్సుకు ఏటికేడు పెరుగుతున్న ఆదరణే ఇందుకు నిదర్శనం. ప్రపంచంలోని టాప్ సైంటిస్టులు, రెగ్యులేటర్స్, బిజినెస్ లీడర్లు ఇందులో పాల్గొంటున్నారు.
-సతీశ్‌రెడ్డి, చైర్మన్, రెడ్డీస్ ల్యాబొరేటరీస్
ఆరోగ్య సంరక్షణలో ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన చర్చలకు ఇది మంచి వేదిక. బయోఏషియా సదస్సులో భాగస్వాములుగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఫార్మా, బయోటెక్, లైఫ్‌సైన్సెస్ రంగాలకు చెందినవారికి ఇది కీలక సదస్సు. దీని ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
-గారెత్ విన్ ఓవెన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్
కొవిడ్ వ్యాక్సిన్ల తయారీకి భారత్‌లోని కంపెనీలు ఎంతో కృషిచేశాయి. వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ 2.2 బిలియన్ డోసులు ఇచ్చాం. కొవిడ్ సందర్భంలో వ్యాక్సిన్, ఇతర మందుల ద్వారా 3.4 మిలియన్ జీవితాలను కాపాడం. 258 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను 101 దేశాలకు సరఫరా చేశాం. 150 దేశాలకు అత్యవసర మందులను సరపరా చేస్తున్నది భారత పరిశ్రమ. ఇక్కడి రెగ్యులేటరీ సిస్టం బాగా పనిచేస్తున్నది. ఈ రంగం అభివృద్ధికి అనేక కొత్త సంస్కరణలు తెచ్చాం. జీ-20 సమావేశాల్లో భాగంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్, అఫర్డబుల్, ఎఫెక్టివ్, క్వాలిటీ ట్రీట్మెంట్, డిజిటల్ హెల్త్ ఫర్ పబ్లిక్ అనే మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నది.
-వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యుడు