హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): భారతదేశ రక్షణ అవసరాల చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. హైదరాబాద్ కేంద్రంగా అధునాతన చిన్నతరహా ఆయుధాలు ఉత్పత్తి కానున్నాయి. నగరానికి చెందిన ఐకామ్ సంస్థ రక్షణ, సైనిక దళాలకు అవసరమైన అధునాతన ఆయుధాల తయారీ, సరఫరాలో ప్రపంచస్థాయి పేరు ప్రఖ్యాతులున్న కారకల్ ఇంటర్నేషనల్ సంస్థతో సాంకేతికత బదిలీ ఒప్పందం కుదుర్చుకొన్నది.
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గ్రూప్ కంపెనీ అయిన ఐకామ్ సంస్థ భారతదేశ రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల తయారీలో భాగస్వామి. రక్షణరంగ ఆయుధాల తయారీ భాగస్వామ్యంలో మొదటిసారిగా టెక్నాలజీ బదిలీ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఈడీజీఈ భాగస్వామ్య సంస్థ కారకల్‌తో ఐకామ్ మంగళవారం ‘భాగస్వామ్యం – లైసెన్సింగ్’ ఒప్పందంపై సంతకం చేసింది. ఒప్పందంలో భాగంగా ఐకామ్ సంస్థ హైదరాబాద్ శివారులోని తమ యూనిట్లో కారకల్ టెక్నాలజీతో చిన్నపాటి ఆయుధాలను తయారు చేసి భారతీయ మారెట్ అవసరాలకు సరఫరా చేస్తుందని ఐకామ్ వర్గాలు తెలిపాయి. యూఏఈలోని అబుదాబిలో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ట్రై-సర్వీస్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఐడీఈఎక్స్-2023లో ఈ మేరకు ఐకామ్-కారకల్ మధ్య ఒప్పంద సంతకాలు జరిగినట్టు వారు పేర్కొన్నారు.
హైదరాబాద్ యూనిట్లో తయారుకానున్న ఆయుధాలు
కారకల్ టెక్నాలజీతో పూర్తిస్థాయి చిన్న ఆయుధాలు హైదరాబాద్‌లోని ఐకామ్లోనే తయారు కానున్నాయి. తాజా ఒప్పందంతో కారకాల్ ఈఎఫ్ పిస్టల్, ఆధునిక సీఎంపీ 9 సబ్ మెషిన్ గన్, సీఏఆర్ 814, సీఏఆర్ 816, సీఏఆర్ 817 టాక్టికల్ రైఫిల్స్, సీఏఆర్ 817 డీఎంఆర్ టాక్టికల్ స్నైపర్ రైఫిల్, కారకల్ సీఎస్ఆర్ 338, సీఎస్ఆర్ 308 బోల్ట్ యాక్షన్ స్నైపర్ రైఫిల్స్, సీఎస్ఏ 338 సెమీ ఆటోమేటిక్ స్నైపర్ రైఫిల్ తదితర ఆయుధాలన్నీ ఇకపై హైదరాబాద్‌లోని ఐకామ్ యూనిట్లో తయారు చేయనున్నారు. క్షిపణులు, వాటి ఉప-వ్యవస్థలు, కమ్యూనికేషన్లు, ఈడబ్ల్యూ సిస్టమ్‌లు, రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టిక్స్, మిక్చర్స్, లాటరింగ్ మందుగుండు సామగ్రి, షెల్టర్లు, డ్రోన్, కౌంటర్-డ్రోన్ సిస్టమ్‌లను తయారు చేసే అతిపెద్ద కంపెనీలలో ఐకామ్ ఒకటి.
చిన్న ఆయుధాల తయారీలో గ్లోబల్ లీడర్ కారకల్
కారకల్ సంస్థ ప్రధాన కార్యాలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో ఉన్నది. పౌరులు, పోలీసులు, సైనిక అవసరాల కోసం వివిధ రకాల చిన్న ఆయుధాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్నది. ఇది ఈడీజీఈ గ్రూప్ అనుబంధ సంస్థ. ఈ గ్రూప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైనిక ఆయుధాల తయారీతోపాటు, సంబంధిత సాంకేతికతలను అందిస్తున్నది. 2007లో స్థాపించిన కారకల్ సంస్థ ప్రభావవంతమైన చిన్న ఆయుధాల తయారీలో గ్లోబల్ లీడర్‌గా ఉన్నది.
రెండు దశాబ్ధాలుగా రక్షణ పరికాల ఉత్పత్తిలో ఐకామ్
ఐకామ్.. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ గ్రూప్(ఎంఈఐఎల్)కంపెని. ఐకామ్ టెలీ లిమిటెడ్, హైదరాబాద్ శివారులో 110 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలుగల తయారీ కేంద్రాన్ని కలిగివున్నది. 1989లో స్థాపించిన ఈ సంస్థ ఇంజనీరింగ్, రక్షణ పరికరాల తయారీలో అగ్రగామి. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, పవర్, రోడ్లు, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం తదితర రంగాల్లో ఐకామ్ కీలక సంస్థ. గత 25 సంవత్సరాలుగా భారతీయ రక్షణ పరిశ్రమ కోసం ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతోపాటు, తయారు చేస్తున్నది.
రక్షణ రంగంలో నూతన అధ్యాయం
భారత రక్షణ పరిశ్రమ సార్వభౌమత్వ అభివృద్ధిలో ఈ సాంకేతిక ఒప్పందం కొత్త అధ్యాయం. భారత రక్షణ రంగాన్ని స్వయం సమృద్ధం చేయడానికి, దేశ రక్షణ అవసరాలు తీర్చడానికి కారకల్ టెక్నాలజీ ఒప్పందం ఎంతో దోహద పడుతుంది. దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా ఆయుధాల సరఫరాలో అడ్డంకులను అధిగమించేందుకు భారత ప్రభుత్వం చూపిన శ్రద్ధ, చొరవ ప్రశంసనీయం. ఆయుధాల తయారీకి ప్రైవేట్ రంగాన్ని అనుమతించడంతోపాటు రక్షణ పరికరాల తయారీలో స్వదేశీకరణకు భారత ప్రభుత్వం ఎంతో చొరవ చూపింది. చిన్న ఆయుధాల ఉత్పత్తిలోకి ప్రవేశించటం ఐకామ్‌కు గర్వకారణం
– పీ సుమంత్, ఎండీ, ఐకామ్
కీలక లక్ష్యాల సాధనకు ఒప్పందం దోహదం
భారతీయ మారెట్లో సహకారం కోసం ఐకామ్తో ఈ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ఒప్పందం కారకల్ కీలక లక్ష్యాల సాధనకు దోహదపడుతుంది. ఇంజినీరింగ్, డిఫెన్స్‌తో సహా బహుళ రంగాలలో ఎండ్-టు-ఎండ్ పరిషారాలను అందించడంలో శక్తి సామర్థ్యాలు కలిగివున్న ఐకామ్ భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాం. అధునాతన చిన్న ఆయుధాలను డిజైన్ చేసి తయారు చేయడంలో కారకల్ శక్తిసామర్థ్యాలు ప్రపంచ గుర్తింపు పొందాయి.
– హమద్ అల్ అమెరి, కారకల్ సీఈవో