హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఖాళీల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తామని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అడ్మిషన్ పొందిన విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుందని స్పష్టంచేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ కూడా అధికారికంగా సమాచారం ఇస్తారని తెలిపారు. మెరిట్ లిస్టును టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చినట్టు పేర్కొన్నారు. ఖాళీల మేరకు ఫేజ్-1, ఫేజ్-2 తర్వాత దశలవారీగా సీట్లను కేటాయిస్తామని వెల్లడించారు. రౌండ్-1 సెలెక్షన్ లిస్టులో పేరున్న విద్యార్థులు ఏప్రిల్ 20లోగా పాఠశాలలో చేరాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత అడ్మిషన్ పొందేందుకు అనుమతించేది లేదని స్పష్టంచేశారు.
టెట్ దరఖాస్తులో టెక్నికల్ సమస్యలు ; తొలిరోజు సాయంత్రం వరకూ ఓపెన్‌కాని వెబ్సైట్
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఫీజు చెల్లింపు విషయంలో ఇబ్బందులు కలిగాయి. దరఖాస్తుల స్వీకరణ తొలిరోజు మంగళవారం సాయంత్రం వరకు వెబ్సైట్ ఓపెన్ కాలేదు. ఓ అభ్యర్థి ఫీజు చెల్లించే ప్రయత్నం చేయగా చెల్లింపు పూర్తికాలేదు. మరో అభ్యర్థికి యువర్ పేమెంట్ ఈజ్ అండర్ ప్రాసెస్, ప్లీజ్ వెయిట్ 15 మినిట్స్ అంటూ అలర్ట్ వచ్చింది. దీంతో అభ్యర్థులు టెట్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం కాలేదు. ఈ అంశంపై ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్‌ను వివరణ కోరగా, సర్వర్‌పై ఒత్తిడి సమస్యతో అంతరాయం కలుగుతున్నట్టు చెప్పారు. మంగళవారం 2,072 మంది ఫీజు చెల్లించగా 1,890 మంది దరఖాస్తులు సమర్పించినట్టు తెలిపారు.