దండేపల్లి, జూలై 15 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ అటవీ భూముల్లో చెట్ల పొదలను తొలగించిన ఆదివాసీ మహిళలను అటవీ శాఖ అధికారులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. లింగాపూర్ పరిధిలోని 380 కంపార్ట్మెంట్లో గల మామిడిగూడ, దమ్మన్నపేటకు చెందిన ఆదివాసీ మహిళలు ఇటీవల అటవీ భూముల్లోని చెట్ల పొదలను తొలగించి విత్తనాలు చల్లారు. దీంతో అటవీ, పోలీసు అధికారులు పలువురికి కౌన్సెలింగ్ ఇచ్చారు. సోమవారం రాత్రి 9 మంది మహిళలను బైండోవర్ చేసేందుకు తాళ్లపేట ఎఫ్ఆర్వో సుష్మారావు సిబ్బందితో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
‘రాత్రి పూట ఎందుకు తీసుకువెళుతున్నారని, ఉదయం వస్తామని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో రెండు గ్రామాల మహిళలు తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం బైఠాయించారు. తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఆదివాసీ మహిళలను బైండోవర్ పేరిట ఇబ్బందులకు గురి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.