జైనూర్, జూన్ 10 : ఆదివాసీల రాజ్యాంగ హక్కులను పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంర శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హకులు ఏజెన్సీలో నిర్వీర్యం అవుతున్నాయని మండిపడ్డారు. అక్రమంగా వలస వచ్చిన ఇతరులకు ప్రభుత్వపరంగా 1/70కి విరుద్ధంగా వసతులు కల్పించడంలో ఉద్దేశమేమిటని ప్రశ్నించారు.
ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1/70, పెసా చట్టాలను అమ లు చేయాల్సిన అధికారులు ఇతరులతో కుమ్మక్కై ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసిఫాబాద్ ఆర్డీవో లొకేశ్వర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ మహిళా సంక్షేమ పరిషత్, రాయి సెంటర్ సభ్యులు, ఇతర సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.