హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ) : ‘పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కొరిగింది’ అనేది సామెత. ఇప్పుడు ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యానాథ్ దాస్ వ్యవహారం అలాగే ఉన్నదని జలసౌధ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతున్నది. సలహాల కోసం నియమించకుంటే ఏకంగా సర్కార్‌నే తప్పుదోవ ప ట్టిస్తున్నారని ఆ శాఖ ఇంజినీర్ల నుంచే గుసగుసలు వినిపిస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల అంశంపై ఇప్పటివరకు ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించిన అంశం ఇటీవల న్యా యవాదులతో నిర్వహించిన సమీక్షలో తేటతెల్లమైందని తెలుస్తున్నది. ఎన్వోసీ పేరిట ప్రా జెక్టును నిర్వీర్యం చేసే కుట్రలనే అమలు చేశారని జలసౌధ వర్గాలు నిప్పులు చెరుగుతున్నా యి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇరిగేషన్ శాఖ సలహాదారుగా ఆదిత్యానాథ్ దాస్‌ను ప్రభుత్వం నియమించింది.
ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి కీలక బాధ్యతలనూ ఆయనకే అప్పగించింది. ఆ సలహాదారు మాత్రం సాధించిందేమీ లేకపోగా, పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన అంశం లో లేని వాదనలకు ముందుకు తెచ్చారు. అప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన ప నులన్నీ పూర్తయ్యాయి. కొద్దిపాటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పనులను పూర్తి చేయాలంటే ఏపీ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుందని మెలిక పెడుతూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ వచ్చారని ఇంజినీర్లు మొదటినుంచీ అభ్యంతరాలు వ్యక్తం చే స్తున్నారు. ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధంగా ఏపీ సీఎం గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను పోలవరం-బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించే ప్రణాళికలను సి ద్ధంచేయడం తెలిసిందే. బనకచర్లకు అనుమతిచ్చి పాలమూరుకు ఎన్వోసీ తీసుకోవచ్చని సైతం సలహాలిచ్చి ఆ ది శగా చర్చలను కొనసాగించారని చర్చించుకుంటున్నారు.
ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల అంశంపై సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అనుమతుల అంశంపై ప్రభుత్వ పెద్దలు ఇటీవల న్యాయనిపుణులతో చర్చించారు. ఈ సందర్భంగా సలహాదారు చెప్తూ వచ్చిన ఎన్వోసీ అంశం సైతం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఎన్వోసీతో సంబంధమే లేదని ఆ న్యాయ నిపుణులు ఈ సందర్భంగా వెల్లడించినట్టు విశ్వసనీయ సమాచారం. పర్యావరణ అనుమతులు తీసుకుని పనులను యథావిధిగా కొనసాగించుకోవచ్చని, ఎలాంటి అభ్యంతరాలు, ఎన్వోసీలే అక్కరలేదని నొక్కి మరీ చెప్పినట్టు తెలిసింది. దీంతో సలహాదారు ఇంతకాలం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారనే అంశంపై సాగునీటిరంగ నిపుణుల్లో తీవ్ర చర్చ కొనసాగుతున్నది. దాస్ వ్యవహరించిన, ఇచ్చిన సలహాలపై పలువురు ప్రభుత్వ పెద్దలు సైతం ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు సమాచారం. బాహాటంగా ఏమీ అనకపోయినా లోలోపల రగిలిపోతున్నారనే చర్చ జరుగుతున్నది.
ప్రభుత్వ సలహాదారుగా ఆదిత్యానాథ్‌దాస్‌ను నియమించిన నాటి నుంచే తెలంగాణ సాగునీటి రంగనిపుణులు, రాష్ట్ర ఇంజినీర్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు హయాంలో ఐదేండ్లు, ఆ తర్వాత జగన్మోహన్రెడ్డి సమయంలో ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేయడంతోపాటు, విరమణ అనంతరం కూడా ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా దాస్ కొనసాగారు. ఆ సమయంలోనే తెలంగాణ నీటిహక్కులను కాలరాసేందుకు ఏపీ ప్రభు త్వం తరఫున దాస్ కీలకంగా పనిచేయడమే ఆ విమర్శలకు ప్రధాన కారణం. ఢిల్లీలోనూ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రంతో అనేక విధాలుగా పైరవీలు చేశారు. అలాంటి వ్యక్తిని తె లంగాణ ప్రభుత్వం ఏకంగా అదే ఇరిగేషన్ శాఖకు సలహాదారుగా నియమించడంపై రాష్ట్ర ఇంజినీర్లు, సాగునీటి నిపుణులు తప్పుబట్టా రు. తాజాగా తొలుత ఎన్వోసీని తెరమీదకు తీసుకొచ్చి, ఆ తర్వాత ఏపీ బనకచర్ల ప్రాజెక్టుకు ఎన్వోసీతో ముడిపెట్టడం తదితర అంశాల్లోనూ సలహాదారు కీలకంగా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.