హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : అడవుల జిల్లా ఆదిలాబాద్ వన్యమృగాల సంచారంతో వణికిపోతున్నది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం నేరేడుపల్లె సమీపంలో ఆవుపై పులిదాడి చేసి హతమార్చింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రవీంద్రనగర్‌లో మేకల మందపై పులి దాడి చేయగా మోహన్‌నాయక్‌కు చెందిన రెండు మేకలు మృతి చెందాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరీ మీదుగా ప్రాణహిత దాటి కుమ్రంభీమ్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు ఏప్రిల్ 3న చింతలమానేపల్లి మండలం బాబాపూర్‌లో రైతు అల్లూరి శంకర్‌పై దాడిచేసి హతమార్చింది. ఏప్రిల్ 4న పెంచికలపేట మండలం కొండపల్లికి చెందిన కారుపోశన్న అనే రైతును తొకి చంపేసింది. తాజాగా ఆదివారం శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ వద్ద ఓ చిరుత రోడ్డు దాటుతుండగా వాహనదారులు చూసి ఉలిక్కిపడ్డారు.