నిర్మల్ అర్బన్/ తూప్రాన్, జూన్ 15 : ఉమ్మడి ఆదిలాబాద్ కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీశ్ కిడ్నాప్ ఘటన నిర్మల్, మెదక్ జిల్లాల్లో కలకలం రేపింది. మెదక్ జిల్లా తూప్రాన్ ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన హరీశ్ పొన్కల్‌లో శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా లేపి అతడి ఇన్నోవా వాహనంలోనే కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. హైదరాబాద్‌వైపు తరలిస్తుండగా మెదక్ జిల్లా తూప్రాన్ టోల్‌ఫ్లాజా వద్దకు రాగానే హరీశ్‌కుమార్ కారులోంచి దూకి తప్పించుకోగా.. కిడ్నాపర్లు అక్కడి నుంచి పరారయ్యారు. హరీశ్ వెంటనే తూప్రాన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆయనను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం హరీశ్‌ను తూప్రాన్ ఎస్ఐ-2 యాదగిరి నిర్మల్ పోలీసులకు అప్పగించారు. నిర్మల్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్య ; ఆర్థిక ఇబ్బందులు తాళలేక సూసైడ్
హిమాయత్‌నగర్, జూన్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన ‘మహిళలకు ఉచిత బస్సు’ పథకం ఆటోడ్రైవర్ల పాలిట శాపంగా మారింది. తాజాగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణగూడ పరిధిలో చోటుచేసుకున్నది. అడ్మిన్ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలు.. విఠల్‌వాడిలో కోటేశ్వర్(50)తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటోతో సరైన ఉపాధి లభించకపోవడంతో కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో మానసికంగా కుంగిపోతున్నాడు. ఈ నెల 10న అతని కుటుంబ సభ్యులు పని మీద బయటకు వెళ్లినప్పుడు.. అప్పటికే కొనుగోలు చేసిన పురుగుల మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు తిరిగి వచ్చాక గమనించి ఉస్మానియా దవఖానకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.