ఆదిలాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ పెద్దలకు కట్టబెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి.. మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో యంత్రాల అమ్మకం విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యంత్ర సామగ్రిని తుక్కు కింద విక్రయించేందుకు వేలం ప్రక్రియ నిర్వహించగా ఎవరూ ముందుకు రాలేదు.
మూతపడిన సీసీఐని పునఃప్రారంభించాలని బీజేపీ మినహా అఖిలపక్షం నాయకులు సీసీఐ సాధన కమిటీని ఏర్పాటు చేసి ఆరు నెలలుగా ఆందోళనలు చేపడుతున్నారు. స్థానిక యువకులు, భూములు కోల్పోయిన వారు, ప్రజాప్రతినిధులు, సీసీఐలో పనిచేసిన ఉద్యోగులు నిరసనల్లో పాల్గొన్నారు. సీసీఐ విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీసీఐ సాధన కమిటీ సభ్యులు జాతీయ రహదారి-44 దిగ్బంధం, నిరాహార దీక్షలు, జిల్లా బంద్‌తోపాటు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
సీసీఐని పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేసింది. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్‌లు గతంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అనంత్గీతేను కలిసి సీసీఐని పునః ప్రారంభించాలని వినతిపత్రం అందజేశారు. సీసీఐని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే తాము ప్రారంభిస్తామని సూచించారు.
పరిశ్రమ పునఃప్రారంభానికి రాయితీలు కల్పిస్తామని చెప్పారు. పలుమార్లు మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేలను కలిసి వినతిపత్రాలు అందజేసినా మోదీ ప్రభుత్వంలో చలనం లేదు.
యంత్ర సామగ్రిని తుక్కు కింద వేలం వేయడానికి మే 5 నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్లో ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టం ద్వారా బిడ్లను ఆహ్వానించి టెండర్లను స్వీకరించారు. టెండర్లు దాఖలు కాకపోవడంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. సీసీఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడితే ప్రజా ఉద్యమం ద్వారా పరిశ్రమను కాపాడుకొంటామని సీసీఐ సాధన కమిటీ సభ్యులు అంటున్నారు.
ప్రజా, రైతు, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మూతపడిన సీసీఐ విషయంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించే ప్రయత్నాలకు ప్రజా ఉద్యమం ద్వారా బ్రేక్ పడినట్లయింది. అయితే యంత్ర సామగ్రి వేలం తర్వాత సిమెంటు పరిశ్రమకు సంబంధించిన విలువైన భూములు, భవనాలను కేంద్ర ప్రభుత్వం అమ్మే అవకాశం ఉన్నదని సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్ విజ్జగిరి నారాయణ తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.