భద్రాద్రి: భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రుడు రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగో రోజైన నేడు నరసింహావతారంలో రాములవారు భక్తులకు కనిపిస్తారు. వేదపండితులు లక్ష్మణ సమేత సీతారాములకు విశేష స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్నారు.
రేపు వామనావాతారంలో, 8న పరశురామావతారం, 9న శ్రీరామావతారం, 10న బలరామావతారం, 11న శ్రీకృష్ణావతారంలో స్వామివారు దర్శనమిస్తారు. ఈ నెల 12న గోదావరిలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. 13న ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్నారు. ఈ నెల 13 వరకు ఆలయంలో నిత్య కల్యాణాలు రద్దుచేశారు. కాగా, కరోనా నేపథ్యంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు అధికారులు భక్తులను అనుమతించడం లేదు. ఆన్లైన్లో అమ్మిన టికెట్ల డబ్బులు తిరిగి చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.