హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖలోని ఇంజినీర్లకు అడ్హాక్ ప్రమోషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 839 మంది డీఈఈలకు ఈఈలుగా, 279 మంది ఈఈలకు ఎస్ఈలుగా, 75 మంది ఎస్ఈలకు సీఈలుగా, నలుగురు సీఈలకు ఈఎన్సీలుగా ప్రమోషన్లు కల్పించింది. జీవో ప్రకారం రిటైర్డ్ ఇంజినీర్లు కూడా ప్రమోషన్ల ఆధారంగా పెన్షన్ పేస్కేల్ పొందే అవకాశం లభిస్తుంది. 30 ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించడంతో ఇంజినీరింగ్ అధికారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
సీనియారిటీ అంశంపై కోర్టు కేసుల నేపథ్యంలో ఇరిగేషన్‌శాఖలో 1975 తరువాత నియమితులైన వారెవరికీ ప్రమోషన్లు లేవు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) స్థాయి పే స్కేళ్లతోనే ఈఎన్సీలుగా, సీఈలుగా, ఎస్ఈలుగా, ఈఈలుగా పనిచేశారు. ఆ హోదాలోనే పదవీ విరమణ పొందారు. డీఈఈ స్థాయి పేస్కేళ్లతోనే పెన్షన్ పొందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కమిటీని నియమించారు. ఆ కమిటీ వర్కింగ్, రిటైర్డ్ ఉద్యోగులతో చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. 12 సూపర్ న్యూమరరి పోస్టులను కల్పించి సమస్యను పరిష్కరించాలన్న సిఫారసుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కోర్టు కేసు నేపథ్యంలో అడ్హాక్ ప్రమోషన్లను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై శాఖలో ఇన్చార్జి పోస్టులు లేకుండా హోదాకు అనుగుణంగా పేస్కేళ్లను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.