హనుమకొండ, డిసెంబర్ 6: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డికి తమ ఉసురు తగిలిందని గ్రీన్ఫీల్డ్ హైవే రైతు లు పేర్కొన్నారు. వెంకట్రెడ్డి శుక్రవారం ఏసీబీకి పట్టుబడటంతో శనివారం హనుమకొండ కలెక్టరేట్ వద్ద పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. దామెర, పరకాల తదితర మండలాలకు చెందిన గ్రీన్ఫీల్డ్ హైవే రైతులు కలెక్టరేట్ వద్దకు ఫ్లెక్సీతో చేరుకొని తమకు నష్టం చేసిన వెంకట్రెడ్డికి బాధితుల ఉసురు తగలిందని, లంచం తీసుకున్న ఆయనను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 1956 గ్రీన్ ఫీల్డ్ హైవే చట్టం ప్రకారం రైతుల నుంచి తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వకుం డా వెంకటరెడ్డి అడ్డుపడ్డాడని ఆరోపించారు. భూ సేకరణ సమయంలో రైతులు లంచం ఇవ్వకపోవడంతోనే అన్యాయం చేశారని వా పోయారు. రైతుల గోస తాకి ఏసీబీకి పట్టుబడ్డాడని చెప్పారు. అవినీతి అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వెంకట్రెడ్డి ఇంట్లో 30 లక్షలు లభ్యం
సుబేదారి, డిసెంబర్ 6: అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇంట్లో రూ.30 లక్షల నగదు లభించింది. శుక్రవారం కలెక్టరేట్ లో ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం జిల్లా విద్యాశాఖ ఇన్చార్జిగా ఉన్న వెంకట్రెడ్డి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు. శనివారం హైదరాబాద్లోని ఆయన నివాసం, కాజీపేట చైతన్యపురిలోని అద్దె నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. చైతన్యపురిలో రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకుని, వెంకట్రెడ్డిని కోర్టులో హాజరుపర్చారు. జడ్జి ఆదేశాల మేరకు వెంకట్రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించినట్టు ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.