ఉట్నూర్, ఏప్రిల్ 4: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో పదో తరగతి తెలుగు పేపర్ జవాబుపత్రాల మిస్సింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ఈ ఘటనపై మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్‌బాషా విచారణ చేపట్టారు. ఉట్నూర్ పోస్టాఫీస్‌ను సందర్శించారు. ఆ సమయంలో కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఉట్నూర్ డీఎస్పీ, జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, పోస్టాఫీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మరోవైపు జవాబుపత్రాల తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోస్టల్‌శాఖ కూడా సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది. ఉట్నూర్ పోస్టాఫీస్ ఎంటీఎస్ రజితను సస్పెండ్ చేస్తూ పోస్టల్‌శాఖ జిల్లా అధికారి ఉత్తర్వులు జారీచేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి నాగరాజును విధుల నుంచి తొలగించారు. జవాబుపత్రాల మిస్సింగ్ నేపథ్యంలో రజితకు ఫిట్స్ రావడంతో ఉట్నూర్ దవాఖానకు అక్కడి నుంచి రిమ్స్‌కు తరలించారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్, డీఈవో ప్రణీతకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ విజ్ఞప్తి చేశారు.