గుండాల, ఏప్రిల్ 10 : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రానికి చెందిన మహిళా రైతు బండి విజయ ధాన్యా న్ని కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్ షాలోమ్ తెలిపారు. బుధవారం నమస్తే తెలంగాణలో ‘పది రోజులైనా ధాన్యం కొంటలేరు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. బండి విజయ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని ఏఈవో క్రాంతికుమార్ పరిశీలించి తేమ శాతాన్ని నిర్ధారించారు. 170 బస్తాల ధాన్యంలో 75 బస్తాల ధాన్యం తేమ శాతం సరిగ్గానే ఉండటంతో ఆ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేశామని, మిగిలిన ధాన్యం తేమ శాతం రాగానే తూకం వేస్తామని ఆయన పేర్కొన్నారు.