హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : దసరా పండుగ రద్దీని సాకుగా చూపుతూ ఆర్టీసీ యాజమాన్యం దారుణంగా దోపిడీ చేస్తున్నదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కొందరు ఉన్నతాధికారులు అతి తెలివితో ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నారని మండిపడుతున్నారు. దసరా పండుగ తర్వాత సొంతూళ్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సు ఎక్కి, టికెట్ తీసుకున్న తర్వాత షాక్కు గురవుతున్నారు. ‘దసరా స్పెషల్’ అని రాసి ఉన్న బస్సులలో మాత్రమే అధిక ధరలు వసూలు చేస్తామని చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం అందుకు విరుద్ధంగా ప్రవర్తించడమే ఇందుకు కారణం. స్పెషల్ బోర్డులు ఏర్పాటు చేయని బస్సులలో కూడా అధిక చార్జీలు వసూలు చేయడమేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. బస్టాండ్లలో విపరీతమైన రద్దీని తట్టుకుని సీటు దక్కించుకోవడమే ప్రయాణికులకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సీట్లో కూర్చుని, టికెట్ తీసుకున్న తర్వాత చార్జీ చూసి ప్రయాణికులు కంగుతింటున్నారు. ఇంత చార్జీ ఏంటని ప్రశ్నిస్తే ‘ఇది స్పెషల్ బస్… 50 శాతం టిక్కెట్ ధర ఎక్కువ వసూలు చేస్తాం’ అని కండక్టర్లు, డ్రైవర్లు చెప్తున్నారు. ‘మరి స్పెషల్ అంటూ బోర్డు ఎందుకు పెట్టలేదు?’ అని ప్రయాణికులు ప్రశ్నిస్తే ‘ఇష్టముంటే టికెట్ తీసుకోండి.. లేకపోతే దిగిపోండి’ అంటూ దురుసుగా సమాధానం చెప్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. టికెట్ తీసుకున్నవాళ్లు ఎలాగో దిగిపోలేరు. టికెట్ తీసుకోని వాళ్లు కూడా దిగలేని పరిస్థితి. కష్టపడి సీటు దక్కించుకున్న తర్వాత దిగలేక, అధిక చార్జీలైనా భరిస్తూ ప్రయాణించాల్సి వస్తున్నది. దసరాకు ముందు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న రాత్రుళ్లు కూడా ‘స్పెషల్ బోర్డులు’ ఏర్పాటు చేయకుండానే ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయడం విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ రూట్లలో అధిక వసూలు జోరుగా జరిగిందని ప్రయాణికులు చెప్తున్నారు.
శుక్రవారం ఉదయం నుంచే రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో విపరీతమైన రద్దీ కనిపించింది. చార్జీలతో సంబంధం లేకుండా ఏ బస్సు అయినా ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. గంటల తరబడి బస్సుల కోసం వేచి చూసిన వారు.. వచ్చిన ఒక్క బస్సును మిస్ చేసుకోవద్దనే ఆరాటంతో సీట్ల కోసం పరుగెత్తారు. కుటుంబ సమేతంగా కూడా సీట్ల కోసం పాట్లు పడటం కనిపించింది. చిన్నచిన్న పిల్లలను వెంటేసుకొని కూడా చాలామంది సీటు కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే అదునుగా ఆర్టీసీ అధికారులు ముందుగా సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను పాయింట్లలో పెట్టారు. అవి పూర్తిగా నిండిని తర్వాతనే ఎక్స్ప్రెస్లు, స్పెషల్ బస్సులను వదిలారని ప్రయాణికులు మండిపడుతున్నారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేసే స్పెషల్ బస్సులకు కనీసం బోర్డులు పెడితే బాగుంటుందని వారు అంటున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని నూతన ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. శుభ్రత, తాగునీటి సౌకర్యం, కుర్చీలు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను ప్రత్యేకంగా సమీక్షించి, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో ప్రయాణికుల సౌకర్యాలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ఎంజీబీఎస్, జేబీఎస్ బస్స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా బస్స్టేషన్ల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ స్టేషన్లను పరిశీలించారు. లాజిస్టిక్స్ కౌంటర్లను సందర్శించారు. అనంతరం నాగిరెడ్డి స్వయంగా కొన్ని బస్సుల్లో ఎకి వాటి శుభ్రత, సీటింగ్ సౌకర్యాలు, సాంకేతిక పరిస్థితులను సమీక్షించారు. ప్రయాణికులతో ముచ్చటించారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.