హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ) : రాజకీయ, ఆర్థిక అవినీతికి అదానీ సాం పరాకాష్ట అని, దీనిపై సమగ్ర విచారణ జరిపి అదానీని, ఇందుకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ డిమాండ్ చేశారు. అదానీ ముడుపుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నదని, ప్రధాని మోదీకి అదానీ, ఏపీ మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని తెలిపారు. రూ.1,750 కోట్ల ముడుపులు ఇచ్చి రూ.లక్ష కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నదని విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న నారాయణ ఈ మేరకు ఆదివారం వీడియో విడుదల చేశారు.
అమెరికాలోని న్యూయార్ కోర్టులో భారతదేశ కార్పొరేట్ దిగ్గజమైన అదానీపై లంచం కేసు నమోదయిందని, మనదేశంలా కాకుండా అక్కడ జాప్యం లేకుండా ఆర్థిక నేరాల కేసులను త్వరగా పరిష్కరిస్తారని వివరించారు. మోదీకి అదానీ కుడి భుజం లాంటివాడని, ఈ కేసును అమెరికా గవర్నమెంట్ సీరియస్‌గా తీసుకుంటుందా? లేదా? ఆదానికి మద్దతుగా మోదీ అడ్డం పడుతారా? అనేది వేచిచూడాల్సిందేని చెప్పారు. ఆదానీపై చర్య తీసుకుంటే అమెరికా నిజాయితీ నిలబడుతుందని, ఈ కేసుకు మోదీ అడ్డుపడకుండా ఉంటే ఆయనకు స్వచ్ఛత వస్తుందని పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం, మోదీ కుమ్మకై ఈ అవినీతి కేసును రూపుమాపాలని ప్రయత్నించడం సరికాదని హితవుపలికారు. కేసు సత్వర పరిషారానికి పెద్దఎత్తున ప్రజా ఉద్యమం రావాలని అభిప్రాయపడ్డారు. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అవినీతి లింకు అంటే ఆశ్చర్యంగా ఉన్నదని చెప్పారు. రూ.1,750 కోట్ల అవినీతికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లక్ష కోట్ల మూల్యం చెల్లించాలా? అని ప్రశ్నించారు.