తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటి గడ్డగా పిలిచే యాద్రాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట గ్రామం.. కొన్ని రోజులుగా కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నది. ఆ మాటకొస్తే, ఆ ఒక్క గ్రామంలోని వారేకాదు పరిసర ప్రాంతాల్లోని 20కి పైగా గ్రామాల ప్రజలందరిదీ ఇదే పరిస్థితి. అదానీకి చెందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయమే వారి ఆందోళనకు ప్రధాన కారణం. ప్రభుత్వం -కార్పొరేట్ శక్తులు చేతులు కలిపి ప్రజలను, పర్యావరణాన్ని వంచిస్తున్న తీరుపై మరో పోరాటానికి రామన్నపేట సిద్ధమవుతున్నది
Ramannapeta | (స్పెషల్ టాస్క్ బ్యూరో) / హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): 2022-23లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన అరిఫ్ సయ్యద్ (ఫోన్ నంబర్ 81493 64308) రామన్నపేట గ్రామానికి వచ్చాడు. అదానీ గ్రూప్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నట్టు నమ్మబలికాడు. రామన్నపేటలో అదానీ లాజిస్టిక్స్ పార్క్, డ్రైపోర్ట్‌ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని, ఈ క్రమంలో భూసేకరణ చేయాల్సిందిగా కంపెనీ తనను పంపించినట్టు గ్రామంలోని కొందరిని నమ్మించాడు. చిట్యాల మండల సమీపంలో డ్రైపోర్టు ఏర్పాటుకు యోచిస్తున్నామంటూ అంతకుముందే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించడంతో ఆ డ్రైపోర్టు, లాజిస్టిక్ పార్కు ఇదేనని అంతా విశ్వసించారు. ఇదే అదునుగా భావించిన సయ్యద్ అప్పటికే తన దగ్గరున్న భూముల సర్వే నంబర్లను వారికి చూపించి.. రైతులు తనకు ఆ భూములు విక్రయించేలా చేయాలని మధ్యవర్తుల సాయం కోరాడు. లాజిస్టిక్స్ పార్కు, డ్రైపోర్టు వస్తే, గ్రామంలోని తమ బిడ్డలకు ఉపాధి అవకాశాలు వస్తాయని అంతా నమ్మారు. దీంతో రామన్నపేట, కొమ్మాయిగూడెం, సిరిపురం తదితర గ్రామాల రైతులు తమ పంటపొలాలను తక్కువ ధరకే అమ్మడానికి ఒప్పుకొన్నారు. రైతుల నుంచి భూములను డిపెండెన్షియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కొనుగోలు చేయించాడు సయ్యద్. 2022 సంవత్సరంలో ప్రారంభమైన ఈ భూముల కొనుగోళ్ల వ్యవహారం 2023 సంవత్సరాంతం వరకూ కొనసాగింది.
పిడుగు పడింది ఇలా..
లాజిస్టిక్స్ పార్కు, డ్రైపోర్టు పేరిట రైతుల నుంచి కొనుగోలు చేసిన దాదాపు 365 ఎకరాల భూములకు డిపెండెన్షియా కంపెనీ ప్రతినిధులు హద్దులు ఏర్పాటు చేశారు. ఆ భూముల్లోకి బయటి వ్యక్తులు రాకుండా గేటును కూడా ఏర్పాటు చేశారు. కాలం గడిచింది. తమ బిడ్డలకు ఉపాధి లభిస్తుందనుకొన్న రైతులకు నిరాశే మిగిలింది. అలా దాదాపు 8 నెలలు గడిచాయి. గత నెల 21న అకస్మాత్తుగా అదానీకి చెందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని రామన్నపేటలో ఏర్పాటు చేయబోతున్నట్టు, దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్టు పత్రికలో ప్రకటన వచ్చింది. దీంతో భూములిచ్చిన వారు ఉలిక్కిపడ్డారు.
365 ఎకరాలు కొని.. 65 ఎకరాలకే డ్రైపోర్టు-లాజిస్టిక్ పార్క్ పేరిట వంచించి అదానీ కంపెనీ రైతుల నుంచి 365 ఎకరాల పంట భూములను సేకరించింది. వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇతరత్రా డాక్యుమెంటేషన్‌ను కూడా పూర్తిచేసింది. సెప్టెంబర్ 21వ తేదీన ఇచ్చిన పత్రికా ప్రకటనలో మాత్రం రామన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసే అంబుజా సిమెంట్ విషయమై 65 ఎకరాలకు మాత్రమే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్టు వెల్లడించింది.
మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం ఆసక్తి
రామన్నపేట గ్రామం అభివృద్ధి గురించి పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం అదానీ ఫ్యాక్టరీ కోసం మాత్రం ఆగమేఘాలమీద మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా చిట్యాల నుంచి భువనగిరి వరకూ నాలుగు లేన్ల రహదారిని, పెద్దకాపర్తి నుంచి కొమ్మాయిగూడెం మీదుగా రామన్నపేట గ్రామానికి 100 అడుగుల వెడల్పుతో రహదారిని నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
అదానీ కోసం ధర్మారెడ్డిపల్లి కాలువ
సాగు, తాగునీటి కోసం కోట్లు వెచ్చించి నిర్మించిన ధర్మారెడ్డిపల్లి కాలువను ఇప్పుడు అదానీ ఫ్యాక్టరీ పాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. సిమెంట్ ఫ్యాక్టరీకి కావాల్సిన నీటిని సరఫరా చేసేందుకు వీలుగా కాలువ మొత్తాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సుమారు రూ.146 కోట్లతో బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డిరెడ్డి పల్లి కాలువ నిర్మాణ పనులను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2016లో కేసీఆర్ ప్రభుత్వం మొత్తంగా 3 కాలువ నిర్మాణం కోసం రూ. 284కోట్లను మంజూరు చేసింది. అందులో ధర్మారెడ్డిపల్లి కాలువ కూడా ఒకటి. మూసీలోని నీరు వలిగొండ మండలంలోని గోకారం చెరువులోకి చేరుతుంది. అక్కడి నుంచి ఆసిఫ్‌నగర్ కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువలు వేరుగా ప్రవహిస్తాయి. పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి నుంచి నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం వరకు మొత్తంగా 51.51కి.మీ. పొడవు కాగా, ఇప్పటికే దాదాపు రూ.65 కోట్లను వెచ్చించి 45 కి.మీ. మేరకు కాల్వను పూర్తిచేశారు. కాల్వ కింద దాదాపు 17 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అదానీ ఏర్పాటు చేయనున్న పరిశ్రమ నుంచే ఈ ధర్మారెడ్డిపల్లి కాలువు పారుతుండడం గమనార్హం.
ఫ్యాక్టరీ కోసమే కాలువ విస్తరణ
ఏకంగా కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని సైతం అవసరానికి మించి విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించింది. ఆ మేరకు నిధులను కూడా మంజూరు చేసింది. సిమెంట్ ఫ్యాక్టరీకి రోజుకు లక్షల లీటర్ల నీరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాలువ ద్వారా రోజుకు 3 లక్షల లీటర్లు మాత్రమే అందే పరిస్థితి ఉంది. వాస్తవంగా ధర్మారెడ్డిపల్లి కాలువను తొలుత 55 క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్ చేయగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని ఏకంగా 355 క్యూసెక్కులకు విస్తరించేందుకు కసరత్తును ప్రారంభించింది. ఇటీవల ఆ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను ఆదేశించింది. ధర్మారెడ్డిపల్లి కాలువ పనులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
సిమెంట్ ఫ్యాక్టరీతో బతికేదెలా?
తమ గ్రామంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఆ దుమ్ము, దూళి, కాలుష్యంతో తమకు ఎక్కడాలేని రోగాలు వస్తాయని రామన్నపేట తదితర గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. జనావాసాల సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో భూ కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యంతో పాటు మనుషుల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిమెంట్ తయారీలో భాగంగా పరిశ్రమ నుంచి విడుదలయ్యే వ్యర్థ రసాయనాలతో పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే బొగ్గు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్తో పాటు జిప్సం, స్లాగ్, క్లింకర్ వంటి రసాయనాలు భూమి, గాలితో పాటు నీటిని కూడా కలుషితం చేస్తాయని చెప్తున్నారు. తద్వారా ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. చర్మ వ్యాధులు, శ్వాసనాళ, ఉదర, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు, పిల్లల్లో ఎదుగుదల లోపం, కంటి చూపు, న్యుమోనియా వంటి సమస్యలతో పాటు గర్భస్రావాలు కూడా జరగొచ్చని చెప్తున్నారు.
తొండలు కూడా గుడ్లు పెట్టవు
సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో బుగ్గిపాలై, మసిబారిన ఈ నేలల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిమెంట్‌ను ఇతర రాష్ర్టాలకు తరలించాలంటే గ్రామాలమీదుగా పెద్దయెత్తున ట్రక్కుల రాకపోకలు సాగుతాయి. దీంతో పరిసర ప్రాంతాల రహదారులు అస్తవ్యస్తం కావడంతో పాటు దుమ్ము ధూళి లేవడంతో ఇండ్లు, మనుషులు, పశుపక్ష్యాదులు, చెట్లు, జలాశయాలు ఇలా ఒకటేమిటి గ్రామాలకు గ్రామాలే నామరూపాల్లేకుండా పోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటి గడ్డ అది. ఎంతో మంది వీరులకు స్ఫూర్తినిచ్చిన నేల అది. పంట పొలాలతో నిన్నటివరకూ సిరులు కురిపించిన ఆ భూమికి ఇప్పుడు పడావుపడే దుస్థితి దాపురించింది. తొండలు కూడా గుడ్లుపెట్టనంతగా ఆ పచ్చని నేల బూడిద కాబోతున్నది స్వచ్ఛమైన వాతావరణంతో నిన్నటివరకూ అలరారిన రామన్నపేట బుగ్గిపాలయ్యే దుస్థితి. సిమెంట్ ప్యాక్టరీ పేరిట అదానీ కంపెనీకి ఆ ప్రాంతాన్ని తనఖా పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరడమే దీనికి కారణం..
నిబంధనలు తుంగలో తొక్కి!
జనావాసాలకు కనీసం 3 కిలోమీటర్ల దూరంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండాలని ఫ్యాక్టరీల చట్టం, 1948లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే, రామన్నపేటకు కేవలం 500 మీటర్ల దూరంలోనే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీ ఏర్పాటులో నిబంధనలను తుంగలో తొక్కారని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు.
అంబుజా ఫ్యాక్టరీతో ప్రభావితమయ్యే గ్రామాలు
రామన్నపేట, కొమ్మాయిగూడెం, సిరిపురం, పెద్దకాపర్తి, యెల్లంకి, బోగారం, నీర్నాముల, జనంపల్లి, ఇస్కిల్ల, దుబ్బాక, తుమ్మలగూడెం(ఇంద్రపాల నగరం), సర్నేనిగూడెం, మునిపంపుల, పల్లివాడ, లక్ష్మాపురం, ఎన్నారం, శివనేనిగూడెం, కక్కిరేణి, చిట్యాల, ఉత్తటూరు.