శేరిలింగంపల్లి/సుల్తాన్‌బజార్, డిసెంబర్ 2 : అనుమానాస్పదంగా మృతిచెందిన కన్నడ బుల్లితెర నటి శోభితాశివన్నది ఆత్మహత్యే అని పోలీసులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శోభిత ఆత్మహత్యకు పాల్పడినట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. కొండాపూర్ శ్రీరాంనగర్కాలనీలోని తన నివాసంలో మృతిచెందిన శోభిత శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేలిందని, పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు వెల్లడించారు. కుటుంబసభ్యులు సైతం ఆమె మృతిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని, భర్త సుధీర్‌రెడ్డితో సైతం ఆమెకు విభేదాలు లేనట్టు తెలిసిందని వెల్లడించారు. శోభిత మృతదేహానికి సోమవారం ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ వైద్యుడు యాదయ్య నేతృత్వంలో శవ పరీక్షలు చేసి అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అందజేయగా స్వస్థలం బెంగళూరుకు తీసుకెళ్లారు.