మంత్రి సురేఖ వయసు 59 ఏండ్లు. 30 ఏండ్లపాటు రాజకీయాల్లో నలిగిన అనుభవం. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడొద్దో తెలుసని అందరం అనుకుంటాం. సినీనటి సమంత వయసు కేవలం 37 ఏండ్లు. ఆమె టాలీవుడ్‌కు వచ్చి 14 ఏండ్లు. తెలుగు రాజకీయాల గురించి ఆమెకు పెద్దగా తెలుసని అనుకోలేం. అయితేనేం మంత్రి సురేఖ బుధవారం తనపై చేసిన అసభ్య వ్యాఖ్యల మీద సమంత ఎంతో హుందాగా, మర్యాదగా, గౌరవంగా స్పందించింది. ఆమె ప్రతిస్పందించిన తీరు సున్నితంగా ఉంటూనే వాడిగా జవాబిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Samantha | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై సినీ నటి సమంత స్పందించారు. ఓ సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన చేసిన సమంత.. మంత్రి సురేఖను సున్నితంగా మందలించారు. సమాజంలో నిలబడి పోరాడటానికి ఎంతో ధైర్మం, బలం కావాలని, దయచేసి తనను చిన్నచూపు చూడొద్దంటూ ఒకింత హెచ్చరించినంత పనిచేశారు. ఓ మంత్రి మాటలకు విలువ ఉంటుందని గ్రహించాలని చురక అంటించారు. ఇతరుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలంటూ హుందాగా హితవు చెప్పారు. విడాకులు తన వ్యక్తిగత విషయమని, దయచేసి దానిపై ఊహాగానాలు మానుకోవాలని పరోక్షంగా హెచ్చరించారు. తమ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకోవడం అంటే ఇతరులు వాటిని తప్పుగా ప్రచారం చేయడం కాదని ఉద్బోధించారు. సమంత విడుదల చేసిన ప్రకటన పూర్తిపాఠం ఇలా ఉంది.
‘మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి పని చేయడానికి, గ్లామర్ పరిశ్రమంలో నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు.. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్నచూపు చూడకండి. మంత్రిగా మీ మాటలకు ఎంతో ప్రాధాన్యముంటుందని మీరు గ్రహించారని భావిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల గుర్తించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని వేడుకుంటున్నా. నా విడాకులు నా వ్యక్తిగత అంశం. దానిపై ఊహాగానాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మా వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచాలని అనుకోవడం అంటే ఇతరులు దానిపై తమ ఇష్టం వచ్చినరీతిగా మాట్లాడాలని కాదు. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూరక్వంగా జరగాయని స్పష్టం చేస్తున్నా. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. మీ రాజకీయ వివాదాల నుంచి నా పేరు ను దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.